పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

   మూట నెత్తినబెట్టుకా మూడుకాళ్ళ
      ముసలిదే కర్ర బుచ్చుకు మోహరించి
      యెక్కు చుండగ చెప్పెడి దేమికలదు?
      పడుచు దంపతులము భయంపడగ దగునె?

   పూలపాన్పులు బరచిన నేలనైన
      కాలు బెట్టినతోడనే కందిపోవు
      నవ్యనవనీతగాత్రి నీ భవ్యమైన
      భక్తియే ఊతగాగొని పైకి జనుమ !

   పెళ్లి వేడుక జూచిపో బిలిచె నన్ను
      చెవిటి మల్లయ్య, మాదె పై చేయి సుమ్ము
      పెళ్లి కూతురు భ్రమరాంబ పిలిచె నంచు
      పెంకితన మేలనే ఆడపెళ్లి దాన !

   ఈ మహాగహనాంతర సీమలోన
      నీవు శ్రీగిరి భ్రమరాంబ, వేను మల్లి
      కార్జునుడ, యాత్రికుల్ ప్రమథాదు లనుచు
      సరస మాడుకొనుచు పైకి జనుద మబల !