పుట:Geetham Geetha Total.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24. తే. అవని సంకల్పజనితంబులైన యాశ
లెల్ల నిశ్శేషముగ వీడి యింద్రతనయ!
మనసుచే నింద్రియముల సమస్తవిషయ
వర్జితములుగ నొనరింప వలయు సుమ్మి.

25. తే. మెలఁకువ గ్రహించి బుద్ధిని మెల్లమెల్ల
వాని సంబంధములనుండి వదలఁగొట్టి
మనసు స్థిరముగా నాత్మయందుననె నిల్పి
వేఱువిషయచింతన మెల్ల విడువవలయు.

26. తే. అధికచంచల మస్థిరమైనమనసు
దేనివైపునఁ బ్రాకుఁనో దానినుండి
మనుజుఁడద్దాని మరలించి మరల నాత్మ
యందె వశ మగురీతిఁ జేయంగవలయు.

27. తే. శాంతియుక్తుండు విగత రాజసగుణుండు
బ్రహ్మ మైనశుద్ధాత్మ రూపమునఁ జెలఁగు
ఘనుఁడు, నిష్కల్మషుండగుఁగాన, నెపుడు
నుత్తమం బగుసౌఖ్యంబు నొందఁగలఁడు.

28. తే. ఈ విధంబునఁ జేసి యోగీశుఁ డెప్పు
డాత్మయందె మనస్సు లయం బొనర్చి
పాపములు పోవ బ్రహ్మానుభవము పొంది
యపరిమిత మగునానంద మనుభవించు.

29. తే. యోగయుక్తాత్ముఁడైనట్టి యుత్తముండు
దాల్చు సమదృష్టి సర్వభూతములయందు;
ఆత్మ నఖిలభూతంబుల యందుఁ జూచు;
నాత్మయందవి యెల్ల నున్నట్లు దలఁచు.