పుట:Geetham Geetha Total.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18. ఆ. నియత మైనయట్టి నిర్మలచిత్తంబు
నెప్పు డాత్మయందు నిల్పఁగలఁడొ
సర్వకామరాగ సంబంధములు నప్పు
డతఁడు వీడి యోగ మాశ్రయించు.

19. తే. నియతచిత్తంబుతో యోగనిరతిఁ బూను
యోగయుక్తునియాత్మకునుపమ గాఁగఁ
బల్కఁబడుచుండు, పార్థ! నిర్వాతమైన
స్థలమున వెలుంగుదీపం బచంచలంబు.

20. ఆ. యోగసేవచేత రాగనిర్ముక్త మౌ
మదికి నెందుఁ గల్గు మహిత సుఖము,
మనసుచేత నాత్మఁగని యెందు మనుజుఁడా
నంద మొందు నాత్మ యందె తగిలి.

21. ఆ. ఎట్టి పరమసౌఖ్య మింద్రియాతీతంబు
గనుక బుద్ధి యొకటె కానఁగలుగు,
నేది యెఱిఁగి నిశ్చయించిన మనుజుండు
నిలుచు దాననే, చపలత మాని.

22. తే. దేనిఁ బొందినమనుజుండు దానికంటే
నితరముల నధికంబుగా నెంచుకొనఁడొ
ఎందుఁ జరియించునాతని కెంతదుఃఖ
ములు తటస్థించినను దాను గలఁత గనఁడొ.

23. తే. అట్టి దానినే యోగం బటండ్రు బుధులు
దుఃఖసంయోగ మద్దానఁ దొలఁగుఁ గనుక
దీని నిజతత్త్వ మెఱిఁగిన మానవుండు
వ్యాకులము వీడి యీ యోగమాచరించు.