పుట:Geetham Geetha Total.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12. ఆ. కూరుచుండి యోగి వేఱెద్ది దలఁపక
యింద్రియముల మనసు నెల్లక్రియల
నియతములుగఁ జేసి నిర్మలాత్మప్రాప్తి
సభ్యసింపవలయు ననవరతము.

13. ఆ. కాయమును శిరంబుఁ గంఠంబు మూఁటిని
సమముగా నచంచలముగ నిలిపి
పూర్ణదృష్టి తనదు భ్రూమధ్యమునఁ జేర్చి
దిశలఁ గననిరీతి స్థిర మొనర్చి.

14. ఆ. పరమశాంతుఁ డగుచు బ్రహ్మచర్యవ్రతం
బమరఁ బూని నిర్భయముగ నరుఁడు
మనసు నిగ్రహించి మచ్చిత్తుఁడై యోగ
యుక్తుఁ డగుచుఁ గూరుచుండవలయు.

15. ఆ. ఇట్లు యోగయుక్తుఁ డెల్లప్పుడును మాన
సమున నన్నె నిల్పి సవ్యసాచి!
నే ననుగ్రహించు నిర్వాణపరమ మౌ
శాంతి నొందఁగలుగు భ్రాంతి వీడి.

16. ఆ. అమితభోజనుండు నధికోపవాసుండు
నిదురపోతు మఱియు నిష్ఫలముగ
మేలుకొనెడువాఁడు మేదినిపై యోగ
మభ్యసింపఁజాలఁడని యెఱుఁగుము.

17. ఆ. మితముగా భుజించి మితవిహారముఁ జేసి
కర్మవిధుల మితముగా నొనర్చి
మితము లైననిద్ర మెలఁకువ ల్గలవాఁడు
వ్యసనములను బాసియగును యోగి.