పుట:Geetham Geetha Total.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11. ఆ. కర్మయోగి చేయుఁ గాయంబునను మఱి
చేతమునను బుద్ధిచేత నింద్రి
యములచేత సంగమావంతయును లేక
యాత్మశుద్ధి యాశయముగఁ గలిగి.

12. ఆ. కర్మఫలములందుఁ గాంక్ష మానినయోగి
శాంతిఁ జెందు నిష్ఠ సలువుకొనుచు;
యోగి గానివాఁడు రాగంబులను మాన
లేక బంధములనె చిక్కుచుండు.

13. తే. మనసుచే సన్న్యసించి కర్మముల, వానిఁ
తన నవద్వారపుర దేహమునకు విడిచి
కార్యకర్త దాఁ గాక యకర్త గాక
యోగి సుఖముగ నివసించుచుండుఁ బార్థ!

14. ఆ. కర్మములను గాని కర్తృత్వమును గాని
కర్మఫలములందుఁ గాంక్ష గాని
యాత్మ గలుగఁ జేయఁడవని నెన్నండును
ప్రకృతివాసనలనె పరఁగు నవ్వి.

15. తే. ఎవనిపాపంబు నైనను నెవనిపుణ్య
మైనఁ దొలఁగింపఁ జాలఁ డీయాత్మ పార్థ!
కప్పఁ బడియుండు జ్ఞాన మజ్ఞానమందు;
దానిచే భ్రమియింతురు ధరణిజనులు.

16. తే. జ్ఞానమున నెట్టి జనుల యజ్ఞానమెల్ల
నాశనము సేయఁబడు;నట్టి నరులకుఁ గల
జ్ఞాన మాదిత్యురీతిఁ బ్రకాశమాన
మగుచు వారలయంధత్వమవలఁ ద్రోయు.