పుట:Geetham Geetha Total.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

05. తే. జ్ఞానయోగంబుచేఁ గల్గుస్థాన మేదొ
కర్మయోగంబునందదే కల్గుచుండు;
జ్ఞానకర్మయోగముల సమానములుగఁ
దెలిసికొనువాఁడె చక్కఁగాఁ దెలియువాఁడు.

06. తే. కర్మయోగసహాయంబుఁ గనక నరుఁడు
జ్ఞానియై సన్న్యసించుట కష్టతరము;
కర్మయోగంబు బ్రహ్మముం గనఁగఁ జేయు
మననశీలుర కతిశీఘ్రమున ధరిత్రి.

07. తే. అర్జునా! యోగి శుద్ధాత్ముఁడగుచు నింద్రి
యముల మానసమును నిగ్రహం బొనర్చి
యఖిల భూతాత్మలను దనయాత్మ గాఁగఁ
దలఁచి చేసెడికర్మముల్దగుల వతని.

08. తే. కర్త యేకార్యమునకును గా నటంచుఁ
దత్త్వవిదుఁ డైనయోగి దాఁదలఁచుచుండుఁ
గనుచు వినుచుఁ దాకుచును మూర్కొనుచుఁ దినుచుఁ
జనుచు నిద్రసేయుచును శ్వాసము విడుచుచు.

09. తే. కొనుచుఁ బల్కుచు వీడుచుఁ గనులఁ దెఱచు
చును గనుంగవ మఱి మూయుచును జెలంగి
యింద్రియంబులు తమతమ యిష్ట విషయ
ములఁ జరించుచుండు నటంచుఁ దలఁచు మదిని.

10. తే. బ్రహ్మమునకుఁ గర్మము సమర్పణముఁ జేసి
సంగ మనునది వర్జించి సలుపునాతఁ
డఖిలపాపచయంబుచే నంటఁబడఁడు
తామరాకు నీరంబునఁ దగులనట్లు.