పుట:Geetham Geetha Total.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

37. తే. అగ్నియఁ దెన్నికట్టియలైనఁగాని
భస్మమై నాశ మొందెడు పగిదిఁ బార్థ!
జ్ఞాన మనునగ్నిచే సర్వ కర్మచయము
భస్మమొనరింపఁబడుచుండు విస్మయముగ.

38. తే. జ్ఞానమున కీజగంబున సాటిలేదు;
అంతకంటెఁ బవిత్ర మైనదియు లేదు;
కర్మయోగ సంసిద్ధుండు గాంచఁగలఁడు
క్రమముగాఁ దనంతటఁ దానె జ్ఞానసిద్ధి.

39. ఆ. ఇంద్రియముల నిగ్రహించి శ్రద్ధ వహించు
తత్పరులకు జ్ఞానధనము గలుగు;
జ్ఞాన మొంద, నచిరకాలంబుననె పొందు
పరమమైన శాంతిపథము పార్థ!

40. ఆ. సంశయాత్ముఁ డగుచు శ్రద్ధ వహింపక
జ్ఞానశూన్యుడైన జనుఁడు చెడును;
సంశయాత్ముఁడైన సంభవింపదు సుఖం
ఇహపరంబులందు నెందు నైన.

41. తే. యోగపద్ధతిఁ గర్మంబులుడుగువాని
జ్ఞానవిచ్ఛిన్న సంశయుండైనవాని
నిశ్చలముగ మనస్సును నిల్పువాని
నంటఁజాలవు కర్మంబు లవనిఁ బార్థ!