పుట:Geetham Geetha Total.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10. తే. భయము రాగంబుఁ గ్రోధంబుఁ బాఱఁద్రోలి
మన్మయాత్ము లై నన్నుఁ ప్రేమమునఁ గొలిచి
ఎందఱో జ్ఞానతపసుచేఁ చెందిరి మును
నాదుసాధర్మ్యభావంబు నయచరిత్ర!

11. తే. ఎవరు నన్నే విధంబుగా నెంచి కొలుతు
రట్లె నాయనుగ్రహము వారందుచుంద్రు;
భక్త జనములు నా స్వభావంబు ననుభ
వింప నేర్తురు కోరిన విధంలనెల్ల.

12. ఆ. కర్మఫలములందుఁ గాంక్ష గల్గినవార
లమరపూజ సేతు రవని నెపుడు;
ఇహమునందుఁ గర్మమెంతయు శీఘ్రంబు
గాఁగ ఫలము నిచ్చుఁ గాదె? పార్థ !

13. ఆ. నాల్గువర్ణములును నా చేత సృష్టింపఁ
బడియెఁ గర్మగుణ విభాగరీతి;
అటులు వానికర్త నయ్యును మఱియుఁగా
కుండ నుందు నవ్యయుండ నగుచు.

14. తే. నన్నుఁ గర్మంబు లంటవు; నాకు వాని
ఫలములందును స్పృహలేదు పార్థ ! నా స్వ
భావ మిట్టి దటంచు నెవ్వం డెఱుంగుఁ
గర్మబంధంబు వానికిఁ గలుగ దెపుడు.

15. తే. దీని నెల్లను గలరీతిఁ దెలిసి పూర్వ
మోక్షకాములచేఁ గర్మములు నొనర్పఁ
బడియె; వార లొనర్చిన పగిది నీవు
నడచుకొను మర్జునా ! విని నాపలుకులు.