పుట:Geetham Geetha Total.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓమ్‌

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

శ్రీమద్భగవద్గీత

చతుర్థాధ్యాయము.

జ్ఞానయోగము

శ్రీ భగవంతుడిట్లనియె :-

01. తే. అవ్యయం బైనయోగమియ్యది కిరీటి!
భాస్కరున కేన యెఱుఁగంగఁబల్కియుంటి;
ఆతఁడది చెప్పె మనువునకతనివలన
నెఱుకపడియె నిక్ష్వాకుధాత్రీశునకును.

02. తే. ఇట్లిది పరంపరగ లభియించె గాన
దీని నల రాజఋషులెల్లఁ దెలిసికొనిరి;
చాలఁగాల మీరీతిగా జరుగ; నేడు
లోకమున యోగ మియ్యది లోప మొందె.

03. తే. మిగుల గుహ్యంబు నుత్తమంబగుటఁజేసి
యీపురాతనయోగంబు నెల్ల జనుల
కెఱుఁగఁజేయంగరానిదిÑ యిపుడు నీకు
భక్తుఁడవు సఖుఁడవు గానఁ బల్కెద సుమి.

అర్జునుడిట్లనియె :-

04. ఆ. ఆదియందు జన్మ మాదిత్యునికిఁ గల్గె
నీదుజన్మ మిపుడు నీరజాక్ష!
ఎట్లు దీని నతని కెఱుఁగఁ జెప్పితి వీవు?
నమ్మునట్లు దెల్పు నళిననాభ !