పుట:Geetham Geetha Total.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అర్జునుడిట్లనియె :-

36. తే. కూడదని యెంచి మనమునఁగోరకున్నఁ
బురుషుఁ డేల బలాత్కార పూర్వకముగ
దేనిచేఁ బ్రేరితుం డయితా నొనర్చుఁ
బాపముల నెల్ల, వచియింపు పరమపురుష!

శ్రీ భగవంతుడిట్లనియె :-

37. తే. అర్జునా! రాజసోద్భవమైనకామ
మనెడిగుణము దుష్పూరంబు గనుక నదియ
పాపహేతువై క్రోధరూపము వహించు;
శత్రువుగ దీని నెఱుఁగుమీ జ్ఞానమునకు.

38. ఆ. ధూమమందు వహ్ని, దుమ్ముచే నద్దంబు,
గర్భకలలమందు కన్నబిడ్డ,
గప్పఁబడినయట్లు కామంబుచేఁ గప్పఁ
బడును జ్ఞాన మెపుడుఁబార్థ! భువిని.

39. ఆ. జ్ఞానమునకు నిత్య శత్రుత్వము వహించి
తీర్పరానియట్టి తృష్ణగలిగి
కామ మనెడురూప నామంబులం బూని
కప్పుజ్ఞానమిది జగంబునందు.

40. తే. కలవు దీని కధిష్ఠానములు మనస్సు
బుద్ధియును నింద్రియములు విశుద్ధచరిత!
వీని నాధారముగఁ బూని జ్ఞానమెల్లఁ
గప్పి దేహికి మోహంబుఁ గలుగఁజేయు.