పుట:Geetham Geetha Total.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓమ్‌

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

శ్రీ మద్భగవద్గీతా

తృతీయోధ్యాయము.

కర్మయోగము

 అర్జునుడిట్లనియె :-

01. తే. కర్మమునకంటె బుద్ధియోగంబె హెచ్చు
గాఁ దలంచితివేని నను గర్మమందె
యేల నియమించెదో కృష్ణ ! యెఱుఁగఁజాల,
ఘోరమైనను జేయక తీఱదనుచు.

02. తే. మిశ్రవాక్యంబులను బల్కి మిగుల నాదు
బుద్ధి భ్రమియింపఁ జేయకు పురుషవర్య !
దేని నొనరింప శ్రేయమో దాని నిశ్చ
యం బొనర్చి వచింపుమీ యంబుజాక్ష !

శ్రీ భగవంతుడిట్లనియె :-

03. తే. ద్వివిధనిష్ఠలు గల వంచుఁదెలిపియుంటి
ముందె, మనుజుల కీలోకమందుఁ బార్థ !
జ్ఞానవరు లాశ్రయింతురు జ్ఞానపథము
కర్మయోగుల కగు నిష్ఠ కర్మమందె.

04. తే. అవనిఁ గర్మ మారంభింపనంతమాత్రఁ
గలుగఁబోవదు నైష్కర్మ్యఫలము పార్థ!
చేయుచుండుకర్మల సన్న్యసించుటయును
జ్ఞానసిద్ధినిఁ గల్గింపఁ జాల దెపుడు