పుట:Geetham Geetha Total.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

27.తే.జనన మొందు టెన్నఁటి కైనఁజచ్చుకొఱకె;
చచ్చు టెల్లను మఱిపునర్జన్మమునకె;
కనుక ననివార్య మైనసంగతి గుఱించి
నీవు శోకించుటిది యెట్టి నీతి చెపుమ.

28. తే. వ్యక్తములు గావు భూతసంభవము లెల్ల;
వ్యక్తపడ వట్లె వాని యంత్యములు గూడ;
మధ్యములు మాత్ర మగపడు హినిఁగాన,
                భూతముల కీవు శోకంబు పొందనేల?

29. తే. కనెడి నాశ్చర్య మంది యొక్కండు వాని;
వినెడి నాశ్చర్య మొందుచు వేఱొకండు;
పలుకు మఱియొకం డాశ్చర్యమగ్నుఁ డగుచు;
వానికలరూపు నెఱుఁగఁ డెవ్వండు గాని.

30. ఆ. సర్వదేహములను సంక్రమించి వసించు
దేహి యెన్నఁటికి వధింపఁబడఁడు;
కనుక భూతజాలమునకయి యిటు నీవు
స్వాంతమందు దుఃఖపడుట తగదు.

38. తే. కష్ట సుఖములు మఱి లాభనష్టములును
జయ మపజయంబు లెల్లను సమము గాఁగఁ
దలఁచి యుద్ధం బొనర్పుము దాని వలనఁ
బాప మొంద వొకింతేనిఁబార్థ! నీవు.

39. తే. కల దిదే జ్ఞానపథము సాంఖ్యంబునందు;
దీని వచియించితిని నీకుదెలియుకొఱకు;
కర్మబంధంబు వదలింపఁ గలుగునట్టి
బుద్ధి యోగంబుఁ గను మింకఁబుణ్యచరిత!