పుట:Geetham Geetha Total.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62.ఆ. శరణు వేఁడు మతని సర్వభావంబులఁ
బరమమైన శాంతిఁ బడయవచ్చుఁ
బరమపదముఁ జేరు భాగ్యంబు గనవచ్చు
నతనిదౌ ననుగ్రహంబుకతన.

63. తే. గుహ్యములలోన నత్యంత గుహ్యమైన
జ్ఞానమిది నీకు నేఁ జెప్పఁ గలిగె; దీని
ననఘ! నిశ్శేషముగ విమర్శనముఁ జేసి
యెట్లు నీ కిష్టమో చేయుమట్లు పార్థ!

64. ఆ. అతిరహస్యములకు నత్యుత్తమం బగు
పరమవచనసమితి మరల వినుము;
నీవు నాకు మిగుల నిష్టుండ వగుటచే
హితముఁ జెప్పుచుంటి నింద్రతనయ!

65. తే. నన్నుఁ దలఁపుము; సలుపుము నాదుభక్తి;
నన్నె మ్రొక్కుము; చేయుము నాదుపూజ;
నన్నుఁ బొందెదు, సత్యంబు; నాకుఁ బ్రియుఁడ
వగుదు వని ప్రతిజ్ఞను జేతు ననఘచరిత!

66. ఆ. సర్వధర్మములను సంపూర్ణముగ వీడి
నన్నుమాత్ర మీవు నమ్ముకొనుము;
నిన్ను నేను బాపనియచంబులోనుండి
ముక్తుఁ జేతు; దుఃఖమును ద్యజింపు.


బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతలోని

పద్దెనిమిదవ అధ్యాయము మోక్షసన్న్యాస యోగము సమాప్తము.