పుట:Geetham Geetha Total.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

15. తే. అవనిలో నెవ్వనికి వీని వ్యథ గలుగదొ
ఎవఁడు సుఖదుఃఖభేదంబులెంచుకొనఁడొ
వాఁడెయగు సమర్థుం డిలఁబాండవేయ!
మోక్షపదవికి నర్హత్వమును గడిరప

16. తే. సత్తు గనక జీవునకు నాశంబు లేదు;
ఉనికి లే దసత్త గుదేహమునకుఁ బార్థ!
నిశ్చయస్థితి నీరెంటి నిర్ణయంబు
తత్త్వవిదులైన వారికే ద్రష్ట మగును.

17. తే. ఎల్ల భువనంబు లందు వ్యాపించియుండు
నాత్మతత్త్వంబు నాశనంబంద దెపుడు;
అవ్యయుండగు నవ్వానివ్యయ మొనర్పఁ
జాలఁడీభువి నెవఁడేని సవ్యసాచి !

18. తే. అప్రమేయు డనాశనుండఖిలనిత్యుఁ
డగు శరీరి వసించు దేహమున కెన్నఁ
డైన నాశంబు తప్పనిదండ్రు గాన
రణ మొనర్పుమీ యికను భారత వరేణ్య

19. తే. ఆత్మ నెవ్వడు వధియించు నదిగ దలచు
దాని నెవ్వఁడు వధ్యంబు గాను దలఁచు
నిరువురును జ్ఞానశూన్యు లంచెఱుఁగవలయు;
హత్య యొనరింపఁ డాత్మదాహతుఁడు గాఁడు.

20. ఆ. జన్మ మొందఁ డాత్మచావం డొకపు డైనఁ
బుట్టి మరల లేక పొవఁడెపుడు
అవ్యయుండు నిత్యుఁడజుఁడు పురాణుండు
హతశరీరఁ డయ్యుహతుఁడు గాఁడు.