పుట:Geetham Geetha Total.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓమ్

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

శ్రీ మద్భగవద్గీత

ద్వితీయోధ్యాయము

సాంఖ్యయోగము


శ్రీ భగవంతుడిట్లనియె :-

11.ఆ. శోక మంది తీవు శోకింపఁ దగనివా
రలకుఁ బ్రజ్ఞ లెల్లఁ బలికి తీవు;
జీవరహితములకు జీవులకును భువి
బండితులు విషాదపడరు పార్థ !

12. తే. నేను లేకుంటి నను టెన్నఁడేని లేదు
నీవు నట్టులె; యీధరానేత లట్లె;
ఇంక ముందును మన మందరెన్నఁటికిని
లేకపోవుదు మనుటయే లేదు సుమ్మి.

13. తే. దేహి కెట్లు గల్గెడినొ యీదేహమందు
బాల్యమును యౌవనము జర వరుస; నట్లె
కలుగు దేహాంతరప్రాప్తి; కనుక, ధీరుఁ
డట్టి దానికై యెపుడు మోహమునఁబడఁడు.

14. తే. పంచతన్మాత్రలను బుట్టి ప్రబలుచుండు
జగతి శీతోష్ణసుఖదుఃఖజాల మెల్ల
వచ్చిపోయెడు నివి, యశాశ్వతము లగుట
వాని నొకయింత యోర్చుకోవలయుఁ బార్థ !