పుట:Geetham Geetha Total.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30.తే. ఇల దురాచారసంపన్నుఁ డేని, యన్య
చింత లేకుండ నన్నుఁ బూజించువాని
సాధు వని యెంచవలయును సవ్యసాచి!
వాఁడు లెస్సగా నిశ్చయ పరుఁడు గనుక.

31. తే. అట్టివాఁడు ధర్మాత్ముఁడై యనతికాల
ముననె శాశ్వత శాంతిని గనఁగలుగును;
నాదుభక్తుని కెన్నఁడు నాశనంబు
కలుగనేరదు; ప్రతినగాఁ దలఁపు దీని.

32. ఆ. పాపయోనిసంభవం బందియును స్త్రీలు
వైశ్యశూద్రజనులు వడయుచుంద్రు
పరమపదము, నన్నుపాసనం బొనరించి
నాయనుగ్రహమున నయచరిత్ర!

33. ఆ. కనుక, మంచి పుట్టుగల బ్రాహ్మణుల రాజ
ఋషుల వేఱ చెప్పనేల? పార్థ!
నీ వసౌఖ్యదం బనిత్య మౌలోకమం
దున్న నేమి? భక్తినన్నుఁగనుము.

34. ఆ. నన్ను నీ దుదృఢ మనస్సున నిల్పుము;
నన్ను భక్తిఁ గనుము నను యజింపు;
నను నమస్కరింపు; నన్నాశ్రయింపుము;
పొందగలవు నన్నె పుణ్యచరిత!



బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతలోని

తొమ్మిదవ అధ్యాయము రాజవిద్యా రాజగుహ్యయోగము సమాప్తము.