పుట:Geetham Geetha Total.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24. ఆ. అవ్యయంబు మరియు నత్యుత్తమము, మదీ
యంబు పరమభావ మరయలేక
బుద్ధిహీనులైన పురుషులు గొంద ఱ
వ్యక్తుఁడైన నన్ను వ్యక్తుఁ డండ్రు.

25. ఆ. యోగమాయ గప్పి యున్నట్టి ననుఁజూడ
నఖిలజనములకును నలవి కాదు;
అవ్యయుండ నగుచు నజుఁడనై యొప్పు నా
రూఢ దెలియఁగలరె మూఢజనులు.

26. ఆ. తెలియు నాకు, భూతములకెల్ల జగతిలో
జరిగినట్టి మఱియు జరుగుచున్న
యట్టి జరుగఁబోవు నట్టి వృత్తాంతముల్‌;
యిట్టి నన్నెరుంగడెవడుగాని.

27. తే. రాగమును ద్వేషమును జెల రేఁగఁ జేయు
ద్వంద్వములు పొడసూ పవిభ్రాంతిఁ జెంది
మోహమున నెల్ల ప్రాణులు మునుఁగుచుండు
జననకాలంబు మొదలుగా సవ్యసాచి !

28. ఆ. పుణ్యకర్ములైన పురుషులపాపంబు
క్షీణ మగుడు వారి చేతమందు
ద్వంద్వమోహముక్తి ప్రబలి వారలు దృఢం
బైననాదుభక్తి నందుచుంద్రు.