పుట:Geetham Geetha Total.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18. తే. వీర లెల్ల రుదారులే వీరవర్య !
అందు, జ్ఞానినిఁ దలఁతు నాయాత్మ యనుచు
నతఁడు నాతోడియోగంబు నందఁగోరి
భావనము సేయుఁ బరమప్రాప్యముగ నన్ను.

19. తే. పుణ్యజన్మంబులను బొంది పొంది, తుదకుఁ
బ్రాప్యమును బ్రాపకంబు సర్వమును వాసు
దేవుఁడే యని జ్ఞాని చింతించు నన్ను;
దుర్లభుండును మఱి మహాత్ముండు వాఁడు.

20. తే. ప్రకృతి సంబంధములగు పాపములచేతఁ
గామములయందు మున్గి యజ్ఞాను లగుచు
నన్యదేవతారాధన లాచరింత్రు
వారి నియమాదు లెల్లఁ దప్పక చరించి.

21. తే. ఎవ్వఁ డెవ్వండు శ్రద్ధతో నెట్టి యెట్టి
మూర్తి భావించి పూజింప మురియుచుండు
వానివాని కాశ్రద్ధయే వదలకుండ
నిలుచునట్టు లొనర్తు, నే నిశ్చలముగ.

22. ఆ. వాఁడు నట్టి శ్రద్ధవహియించి యాదేవ
తనె యుపాసనమున వినతిసేయఁ
గలుగు దానివలనఁ గామ్యార్థ సిద్ధి, వా
నికి హితంబు గోరి నే నొసంగ.

23. ఆ. అల్పబుద్ధులైన యట్టి వారలు పొందు
ఫలము లెల్ల నంత వంతము లగు;
దేవభక్తులెల్ల దేవతలను జెంద
నన్నుఁ జెందఁగలరు నాదుప్రియులు.