పుట:Geetham Geetha Total.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12. తే. సాత్త్వికము లైన, మఱియు రాజసము లైనఁ
దామసము లైన నిలఁ బదార్థముల కెల్లఁ
బ్రభవ మెపుడును గలుగు నావలన; వాని
యందు నే నిల్వ, నవియ నాయందు నిలుచు.

13. తే. ఈజగం బెల్ల సాత్త్విక రాజసమయ
తామసమయంబు నౌటచే నామహత్య
మవ్యయం బని శ్రేష్ఠం బటనియు జనము
లరయఁజాలక మోహంబు నందియుంద్రు

14. తే. దైవరచితమౌ నామాయ దాఁటఁగల్గు
టధికకష్టంబు గావున నవనియందు
నన్ను శరణంబుఁ జొచ్చెడు నరులు దాని
దాఁటుదురు శీఘ్రగతిని సుత్రామతనయ !

15. తే. పాపకర్ములు మూఢులు మానుషాధ
ములును నజ్ఞానవిభ్రాంతి మెలఁగువార
లసురభావంబుఁ జెందిన యట్టి జనులు
న న్ను పాసించునట్టి జ్ఞానంబుఁ గనరు.

16. తే. నన్ను భజియించు మనుజులు నాల్గుతెఱఁగు
లగుదు రలపుణ్యకర్ములయందుఁ బార్థ!
ఆర్తుఁడును మఱిజిజ్ఞాసువర్థకామి
జ్ఞాని యని వారినామముల్జగతియందు.

17. ఆ. వారిలోన నిత్య బంధువై నాయందె
చేయు భక్తి జ్ఞాని శ్రేష్ఠుఁడగుచు;
అట్టివాని కగుదు నత్యంతప్రియుఁడను;
వాఁడు నట్టె నాకుఁ బరమప్రియుఁడు.