పుట:Geetham Geetha Total.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓమ్‌

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

శ్రీ మద్భగవద్గీత

సప్తమాధ్యాయము.

విజ్ఞాన యోగము



శ్రీ భగవంతుడిట్లనియె :-

01. తే. కాంక్ష నాయందె కల్గి యోగం బొనర్చి
యాశ్రయము లేదు నాకంటె ననుచుఁ దలఁచి
నన్ను సంపూర్ణ మైనజ్ఞానంబుతోడ
సంశయము లేక తెలిసెడు సరణి వినము.

02. తే. జ్ఞానమును నీకు నేఁడు విజ్ఞానసహిత
ముగ వచించెద నిశ్శేషముగఁ గిరీటి!
ఏది యరసిన పిమ్మట నింక నొకటి
యరయవలసిన దుండదో యట్టి దాని.

03. తే. నరులలో సిద్ధికై ప్రయత్నంబు సేయు
వాఁడు వేయింటి కొకఁడు గన్పట్టు టరుదు
అట్లు యత్నించువారలయందు సహిత
మెవ్వడో యొక్కఁడుండు నన్నెఱుఁగువాడు.

04. ఆ. అవనియును జలంబులగ్నియు వాయు వా
కాశమును మనస్సు గలిసి బుద్ధి
యును నహంకరమునని యష్ట విధముల
నాడు ప్రకృతి చెలఁగు నవ్యచరిత !

05. తే. ఇట్టి ప్రకృతి నికృష్ణ మౌనింద్రతనయ!
యఖిలజగముల కాధారమగుచు మిగుల
శ్రేష్ఠమై జీవరూపమై చెలఁగు ప్రకృతి
వేఱు గాఁగ నెఱుంగుమీ వీరవర్య !