పుట:Geetha parichayam Total Book.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గీతాపరిచయము

భూమి విూద గల జీవరాసులలో మనిషి అన్నిటికంటే ఎక్కువ బుద్ధిబలము కలవాడు. బుద్ధిలో అన్నిటికంటే గొప్పవాడైన మానవుడు, అన్నిరంగములలో అతి సూక్ష్మాతి సూక్ష్మముగ యోచించగల్గుచున్నాడు. కాని ఒకేఒక ఆధ్యాత్మికరంగములో మాత్రము హీనాతిహీనముగ వెనుకబడి ఉన్నాడు. ఉదాహరణకు ఒక న్యాయవాది (అడ్వకేట్‌) ఉన్నాడనుకొందాము. అతడు అన్యాయపరుని వైపు వాదించుటకు ఒప్పుకొని, తన బుద్ధిచేత అన్యాయమును, న్యాయముగ వర్ణించి, తన క్లౖెెంట్‌ చేసినది న్యాయమనిపించి శిక్షనుండి తప్పించగల్గుచున్నాడు. అలాగే ఒక డాక్టరు తన దగ్గరకు వచ్చిన రోగియొక్క భయంకర రోగమును సహితము, తన తెలివితో వైద్యము చేసి నయము చేయగల్గుచున్నాడు. పోలికలేని క్రొత్తరోగమును బుద్ధితో యోచించి పోగొట్టిన వైద్యుడుగాని, అన్యాయమును న్యాయమన్నట్లు వాదించి గెలిచిన న్యాయవాదిగాని, ఇంకా ఎంతో తెలివిగలవారు గాని, దైవసంబంధమైన విషయములవద్ద మాత్రము పూర్తి తెలివి తక్కువవారై, ఏమాత్రము గ్రహించలేనివారై పోవుచున్నారు. ప్రపంచ విషయములలో వికసించిన బుద్ధి, పరమాత్మ విషయములలో మాత్రము ముకుళించుకొని పోవుచున్నది. మానవుడు ప్రపంచ విషయములలో ఎంతో అభివృద్ధి చెందుచు పూర్వము లేనివి, ఎవరికి తెలియనివి అయిన ఎన్నో క్రొత్త సిద్ధాంతములను, క్రొత్త యంత్రములను కనుగొనుచున్నప్పటికి ఆధ్యాత్మిక విషయములలో మాత్రము పూర్వమున్నవి మరియు పూర్వము అందరికి తెలిసిన విషయములను కూడ గ్రహించలేక పోవుచున్నాడు. ప్రపంచ విషయములను ఎన్నిటినో తెలిసినవాడైనా, పరమాత్మ విషయములను ఎందుకు తెలియలేక పోవుచున్నాడో కూడ గ్రహించలేక, దైవ విషయములలో పూర్తి పొరబడుచున్నాడు. అక్షరములను నేర్చినంత మాత్రముననే అన్ని పట్టాలు వచ్చినట్లు తలచువానిలాగ, తనకున్న కొద్ది భక్తితోనే తనకు పూర్తి జ్ఞానము తెలుసుననుకొనుచున్నాడు.