పుట:Geetha parichayam Total Book.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉండుట వలన వారు నిర్భయముగ పాపము చేయుచు, సాయంకాలము దానిని పుణ్యముగ మార్చుకొనుటకు గీతను వినడము చదవడము చేయుచున్నారే గాని అందులోని అర్థమును గ్రహించడము లేదు. గీతలో ఏమి చెప్పారో తెలిసి నడుచుకోమని చెప్పితే అది మాకు అవసరములేదు, అది మాకు సాధ్యము కాదు, దానికంటే గీతామహత్యములో చెప్పినట్లు గీతను వినుచువస్తే పాపము పుణ్యముగ మారునుకదా! ఇదే సులభము కదా! అనుచున్నారు.

భగవద్గీత, పాప పుణ్యరహితుడవై మోక్షము పొందమని చెప్పితే, గీతా మహత్యము పాపములను పుణ్యములుగ మార్చుకొమ్మని చెప్పుచున్నది. వాస్తవానికి పాపపుణ్యములు మానవులు సంపాదించినపుడు అవి వాని కర్మచక్రములోని సంచితకర్మలో చేరిపోయి మరుజన్మలలో అనుభవింపవలసి వచ్చును. అట్లుకాక గీతను వినుట వలన పాపము పుణ్యముగ మారుననుట అభూతకల్పనయే గాని సత్యముగాదు. వినుటకు అవకాశముండి కూడ గీతను వినని ఒక వ్యక్తిని కలిసి "ఏమయ్యా నీవు గీతను కనీసము వినడము కూడ లేదు. మీ ఇంటి ప్రక్క దేవాలయములో ప్రతి దినము గీతను పారాయణము చేయుచున్నారు కదా! వినుటకు మంచి అనుకూలము కదా" అని అడిగితే, ఆయన "నేనేమి పాపములు చేయలేదు. పాపము చేస్తే కదా పుణ్యములుగా మార్చుకొనుటకు గీతను వినాలి. నేను పుణ్యమునే చేయుచున్నాను, కావున గీతను వినవలసిన పనిలేదు" అన్నాడు. మీరెందుకలా అంటున్నారని మేమడుగగా "గీతామహత్యములో వ్రాసిపెట్టారుకదయ్యా! మీకంతమటుకు తెలియదా" అన్నాడు. ఆ మాట విన్న మేము గీతామహత్యము ముఖ్యముకాదయ్య గీతయే ముఖ్యమని చెప్పగ, అతను నవ్వి ఇలా అన్నాడు, "గీతా మహత్యములో 20వ శ్లోకము చూడుము. గీతను చదివినప్పటికి గీతామహత్యము చదవకపోతే ఫలితమేలేదని ఉంది. కావున గీతకంటే గీతామహత్యమే ముఖ్యమని మాకు తెలుస్తున్నది".