పుట:Geetha parichayam Total Book.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎవరంతకు వారనుకొనుటకు మొదలు పెట్టారు. వాస్తవానికి పాపభీతి లేకుండ పోయినది.

పెద్దలు యమలోకము ఎక్కడో ఉందని వర్ణించక ఇక్కడే ఉందని, భూమి మీద అనుభవించు కష్టబాధలన్నియు యమబాధలేనని, వాస్తవము తెలిపియుంటే ప్రత్యక్షముగ జరుగు ఘాెరమైన బాధలను చూచి, మానవుడు పాపము యొక్క పరిణామమిట్లుండునని తెలుసుకొని, భయముకల్గి పాపపు పనుల నుండి తప్పించు కొనెడివాడు. ఉన్నదున్నట్లు చెప్పక మానవులకు అర్థము కావాలని కథల రూపముగ అల్లి చెప్పిన మాటలు మానవులకు పెడదారిని చూపినవి. అట్లే ఈనాడు "గీతామహత్యము" వలన గీత ఎడల మానవుల భావము పెడదారియే పట్టినదని చెప్పవచ్చును.

కొందరు పెద్దలు గీతను అందరు చదువవలెనని, అందరికి దానియందు భక్తి కల్గునట్లు చేయవలెనని, గీతామహత్యమును ప్రకటించారు. దానివలన ప్రజలు మహత్యమునందు కల్పించిన ఫలితముల మీదనే మనస్సును లగ్నము చేసి గీతలోని విషయములను వదలివేశారు. మహత్యములో ప్రకటించిన ఫలితములే కావాలను కొంటున్నారు. గీతయందు ప్రకటించిన ధర్మములను చూడలేక పోవుచున్నారు. కొందరు పెద్దలు మంచిదని తెలిపిన గీతామహత్యము, మానవుల ఎడల బెడిసికొట్టి అధర్మముల వైపు మరల్చినది. ఆ విధముగ మారుటకు గీతామహత్యమునందు భగవద్గీతకు వ్యతిరిక్తమైన మరియు ధర్మవిరుద్ధమైన మాటలెన్నో గలవు. అందువలన మనమందరము గీతా మహత్యమంటే ఏమిటో తెలుసుకోవాలి.

భగవంతుడు గీతయందు ఏ ఉద్దేశ్యమును ప్రకటించాడో ఆ ఉద్దేశ్యమునకు వ్యతిరిక్త భావములు గీతామహత్యమందు వ్రాయబడుట విచిత్రము. గీతయందు భగవంతుడు ధర్మములు తెలిపియుంటే, ధర్మములకు వ్యతిరేఖముగనున్న వాక్యములను గీతామహత్యములను పేరుతో ఎందరో మరిమరి చెప్పుచు మానవాళిని ప్రక్కదారి పట్టించడము మరీ విచిత్రము.