పుట:Geetha parichayam Total Book.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పురుషుడైన పరమాత్మ, ప్రకృతియైన మాయ యొక్క రహస్యములు తెలియాలంటే చాలా కష్టము. ఎచట పురుషుడున్నాడో అచట ప్రకృతి కూడ గలదు. ఎచట ధర్మమున్నదో అచటనే అధర్మము కూడ ఉన్నది. అట్లే ధర్మముల కూడలియైన భగవద్గీతయందు కూడ అధర్మపు వాసన వుండనే ఉన్నది.

అందువలన పూర్తి వివరణ చేయగలిగినపుడే అందులోని ధర్మములను స్వీకరించి అధర్మములను విడనాడగలము. అటువంటి వివరము ప్రకారము చూస్తే గీతను 700 శ్లోకముల రూపముగ భగవంతుడు చెప్పలేదు. మరియు సంజయుడు విశ్వరూపమునుగాని, యుద్ధరంగములోని ప్రకృతి దృశ్యమును గాని చూడలేదు. అనగా యుద్ధరంగమున జరుగుచున్న ప్రత్యక్ష దృశ్యమును కూడ చూడలేదు. ఇక్కడ కొందరికి ఆశ్చర్యము కల్గి సంజయుడు చెప్పగ ధృతరాష్ట్రుడు విన్న మాటలేగదా భగవద్గీత రూపముగనున్నదను అనుమానమును వ్యక్తము చేయవచ్చును. దానికి మా సమాధానమేమనగా! భగవద్గీత కేవలము శ్రీకృష్ణుడు అర్జునుడు మాట్లాడిన విషయమే గాని ఇతరులకు ఏమాత్రము సంబంధము లేదు. అలాకాక గీత, సంజయ ధృతరాష్ట్ర సంభాషణే అయివుంటే గీతకు సంజయ ధృతరాష్ట్ర సంవాదమని పేరు కల్గెడిది. శ్రీకృష్ణార్జున సంవాదమని పేరు కల్గెడిది కాదు.

గీతను వ్రాసిన వ్యాసుడు సంజయ ధృతరాష్ట్రులు మాట్లాడినట్లు వ్రాశాడు కదా! ఇది అబద్దమా అని కూడ కొందరడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! వ్యాసుడు తెలివిగ శ్రీకృష్ణార్జునులు మాట్లాడిన విషయమంటూనే ఆ విషయమును సంజయ ధృతరాష్ఠ్రులు మాట్లాడినట్లు చిత్రీకరించాడు. ఆనాడు వ్యాసుడు అలా చేయడములో ఒక విశేషము గలదు. ప్రజలు సులభముగ అర్థము చేసుకోవాలను ఉద్దేశ్యముతోనే సంజయ ధృతరాష్ట్రులపాత్ర కల్పించి కొద్దిపాటి గీతను 700 శ్లోకముల రూపముగ చేశాడు. మంచిని బోధించుటకు చిన్న పిల్లలకు బూచోనిని కల్పించి కథ చెప్పినట్లు, వ్యాసుడు కొంత పొడవుగ కొన్ని పాత్రలు కల్పించి చెప్పడములో తప్పులేదు. అయినప్పటికి చిన్న పిల్లలకు