పుట:Geetha parichayam Total Book.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషయమును విన్న అతడు దానిని ఎలా పొందుపరిచి వ్రాస్తే చదువుకొనువాడు సులభముగ తెలుసుకొనగలడని యోచించి, ఎదుటివాడు అర్థము చేసుకొనుటకు తగిన విధముగ ఉండునట్లు మరియు ముందు క్షేమ సమాచారములు అడిగినట్లు, చివరిలో ముగింపును తెలియజేస్తు పొందుపరిచి వ్రాయును. చెప్పినవాడు విషయమొకటి చెప్పినప్పటికి వ్రాయువాడు దానికొక పద్ధతి, వరుస, అందము, అర్థము కలుగజేసి వ్రాసినట్లు భగవంతుడు చెప్పిన మూల సారాంశ విషయమును వ్యాసుడు శ్లోకముల రూపమున తీర్చిదిద్ది వ్రాశాడు. భగవంతుడు చెప్పిన విషయము చిన్నదైనప్పటికి అది అర్థమగుటకు అనేక శ్లోకములుగ, అనేక అధ్యాయములుగ వ్యాసుడు వ్రాయుట వలన ఏడువందల శ్లోకముల గ్రంథ మైన గీత మన ముందున్నది. అన్ని శ్లోకముల సారాంశమును పరిశీలించి చూచితే మూల విషయము బహుకొద్దిగ ఉన్నట్లు తెలియగలదు. అన్ని అధ్యాయములను పిండిచూస్తే సారాంశము కొద్దిదే. "సర్వము వ్యాపించివున్న వానిని నేనొక్కనినే" అను మాటకు విభూతి యోగమను అధ్యాయములో 42 శ్లోకములు చెప్పబడియున్నవి. "సర్వము నేనే" అను విషయమును సూచించుటకు 42 శ్లోకములు వ్రాయబడితే 700 శ్లోకములందు ఇమిడిన భావము కొద్ది నిమిషములలో మాట్లాడు మాటలకంటే మించి ఉండదు. చిన్న విషయమును పొడవైన జాబుగ వ్రాసుకొన్నట్లు, శ్రీకృష్ణుని చిన్న సందేశమును వ్యాసుడు పెద్దగ వ్రాసి చూపించాడే తప్ప ఇంత పొడవైన భగవద్గీత యుద్ధరంగములో జరుగలేదు. జరుగుటకు వ్యవధియులేదు. వ్యాసునిచే వ్రాయబడిన ఇంత పెద్ద భగవద్గీత మానవులకు సులభముగ అర్థమగుటకే తప్ప వేరు ఉద్దేశ్యము లేదని తెలియాలి.

సంజయుడెలా యుద్ధరంగములోని విషయమును ధృతరాష్ట్రునికి తెలియ జేసాడన్నది గీతలోని మొదటి ప్రశ్న. ఒకవేళ సంజయుడు శ్రీకృష్ణుని సందేశమును, ఆయన విశ్వరూపమును తెలుసుకోగలిగాడనుకొందాము. అపుడు అర్జునునకేగాక ఆ విషయము సంజయునికి, ధృతరాష్ట్రునికి కూడ తెలిసినట్లగును. అలా యుద్ధరంగము మొదటిలోనే శ్రీకృష్ణుడు ఫలానాయని తెలిసియుంటే