పుట:Geetha parichayam Total Book.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వరూపము జ్ఞాననేత్రులకు మాత్రము అగుపడగలదు. దేవతలు కూడ ఇంతవరకు చూడని నా విశ్వరూపమును నీకు మాత్రము చూపగలను. విశ్వరూపమును చూచుటకు జ్ఞాననేత్రమునిచ్చుచున్నాను"అని శ్రీకృష్ణుడు చెప్పి ప్రత్యేకమైన జ్ఞానదృష్టినిచ్చి అర్జునునికి మాత్రము చూపినపుడు, సంజయుడు ఏ దృష్టితో విశ్వరూపమును చూచి ధృతరాష్ట్రునికి తెలియబరిచాడు? అన్నది ప్రశ్నే. అర్జునునితో పాటు సంజయుడు కూడ విశ్వరూపము చూడగలిగినపుడు, ఎవరు చూడని దానిని నీకు మాత్రము చూపుచున్నానని శ్రీకృష్ణుడెందుకన్నాడు? ఇలా ఆదిలోనే భగవద్గీత ప్రశ్నలమయమైనది. ప్రశ్నల రూపములో యోచించువారికి సత్యమైన సమాధానము ఏమిటన్నది మనము చూడాలి.

ఇలా యోచించుతూపోతే గీతలోని సత్యములు, రహస్యములు బయట పడగలవు. భగవంతుడు చెప్పిన మాటలు ఎన్నో సందర్భములలో, ఎన్నో విధములుగ మారి, చివరకు ఏడు వందల శ్లోకముల రూపముగ గీత నిలిచివున్నది. ఈనాడు మనముందున్న భగవద్గీతకు, ఆనాడు శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతకు ఏమైన మార్పు ఉన్నదాయని యోచిస్తే, అన్ని విధములైన ప్రశ్నలకు సమాధానము దొరకగలదు. ఆ యోచించేదేదో నిరూపణాత్మకముగ, శాసనబద్ధముగ ఉన్నపుడు అసలైన సత్యములు బయల్పడగలవు. అన్నిటికి సమాధానములు దొరకగలవు. ఈ పంథాలో యోచించినపుడే యుద్ధరంగమున శ్రీకృష్ణుడు అర్జునునకు ఎంతసేపు బోధించాడను ప్రశ్నకు సమాధానము కూడ లభించగలదు.

వ్రాయడానికి చేతకాని లేక చదువురాని ఒక వ్యక్తి ఇంకొక ఊరిలో గల తన బంధువుకు సమాచారము తెలియజేయాలనుకొన్నపుడు, సమాచారమును వ్రాయగలిగిన వ్యక్తి వద్దకు పోయి ఉత్తరము వ్రాసిపెట్టమని అడుగుతాడు. వ్రాయుటకు ఎదుటి వ్యక్తి ఒప్పుకొన్నపుడు సమాచారము చెప్పునతడు చెప్పవలసిన ముఖ్యమైన విషయమును చెప్పి ఊరకుండును. ఆ