పుట:Geetha parichayam Total Book.pdf/27

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదిధర్మములను మాటలతో భగవంతుడు గీచిన గీతను మీకు అందించా లనుకొన్నాము. కాని ముఖ్యగమనిక ఏమంటే ఆరోగ్యవంతునికి కాక రోగమున్న వారికే వైద్యుడు అవసరమన్నట్లు, ఇంతవరకు ఆత్మవాదులకే కాక ఆస్తికులకు, నాస్తికులకు, హేతువాదులకు కూడ మా బోధలు ఎక్కువ ఉపయోగపడినాయి. కొందరు ఆస్తికుల నుండి కొన్ని విమర్శలు వచ్చినప్పటికి, హేతువాదులు, ఆస్తికులు, నాస్తికులు మా బోధల వలన నిజమైన ఆత్మవాదులుగ మారడము మాకు ఉత్సాహము నిచ్చాయి. అందువలన హేతువాదులకు, నాస్తికులకు, ఆస్తికులకు కూడ అర్థమగునట్లు, వారు కూడ దైవత్వమును తెలుసుకొనునట్లు, భగవద్గీత అందరికి జవాబై నిలుచునట్లు వ్రాయపూనినాము. మేము వ్రాయు భగవద్గీతయందు ఎన్నో క్రొత్త అద్భుత ఆశ్చర్యకరవిషయములు బయటపడగలవని ముందే తెలుపుచున్నాము.

ఎన్నో ప్రశంసలు, మరెన్నో విమర్శలు చవిచూచిన మేము అన్నిటిని యోచించి, సత్‌ విమర్శలన్నిటికి తట్టుకొనునట్లు, సత్యమునే ప్రకటించడము మంచిదని మాలోని చిత్తము నిర్ణయించడము మాకు సంతోషము. గీతలో శ్రీకృష్ణుడు కూడ ఒక మాట చెప్పాడు. మానవునికి కావలసిన సుఖముల కోసమే వేదార్థములున్నవని, కష్టములు కడతేరి సుఖములు ప్రాప్తించుటకు వేదములిలా చెప్పుచున్నవని, ఎన్నో విధముల ఉపన్యాసములను కొందరు వేదవాదులు తేనెవలె తియ్యగ ఉండునట్లు బోధించుచున్నారని, ఆ మాటలు విన్నవారు వారి సుఖముల కోసమే దైవ ప్రార్థనాక్రియలు చేయుచున్నారని, శ్రీకృష్ణుడు చెప్పినట్లు అలాంటి తియ్యటి మాటలు మా బోధలలో లేని కారణమున కొందరికి రుచించడము లేదు. "సుఖములందాసక్తి కలిగినవారు వారి సుఖముల కోసమే పూజలు కూడ చేయుదురు కాని వారికి ఆత్మజ్ఞానము పట్టుబడదు" అని శ్రీకృష్ణుడు అన్నాడు. ఆ విధముగనే నేటి ప్రజలు చాలామంది అదే మార్గములో ఉన్నారు. అంతేకాక బోధించు బోధకులు కూడ భగవద్గీత శ్లోకములను మంత్రములవలె జపించుచున్నారు. కాని వాటిలోని ఉన్నత భావమును గ్రహించలేకపోయారు.