పుట:Geetha parichayam Total Book.pdf/22

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గీతలో ఉంటే జీవత్వమునకు అర్థముందని, ఈ గీత దాటితే మానవత్వమునకే అర్థములేదని భగవంతుడు ఏర్పరచిన హద్దునే "భగవద్గీత" అంటున్నాము. లక్ష్మణుడు ఆనాడు పుల్లతో భూమి మీద గీత గీచి దీని లోపలుంటే రక్షణ ఉంటుందని, ప్రమాదము వుండదని, దీనిని దాటకూడదని సీతకు చెప్పాడని చరిత్రలో ఉన్నది. అలాగే భగవంతునిగ ఉద్భవించిన పరమాత్మ, మాటలతో జీవత్వమునకు హద్దు ఏర్పరచి ఈ హద్దు విూరితే మానవత్వమునకు అర్థమే లేకుండ పోవునని, ఈ హద్దులో ఉన్నంతవరకు జీవత్వమునకు అర్థముంటుందని, ఈ గీతలోపలుండు వానికి దైవత్వము ప్రాప్తించునని తెలుపుచు క్రమపద్ధతిగ గీచిన గీతయే "భగవద్గీత".

గీత అంటే హద్దు అనియు, రేఖ అనియు, గీయబడిన గీత అనియు మేము చెప్పితే అర్థము చేసుకోలేని అప్రబుద్దులు కొందరు "అర్థము ఏ నిఘంటువులోనిది? విూకు ఎవరు చెప్పారు? మాలాంటి విజ్ఞులు నవ్విపోతారను ధ్యాస కూడ లేకుండా చెప్పారే!" అని హేళనగా మాకు ఉత్తరములు కూడ వ్రాశారు. అటువంటి వారందరికి చెప్పు జవాబేమనగా! ఇతరులు ఇంతకుముందు చెప్పిన విషయమును, ఇతరులు ఇంతకుముందు వ్రాసిన విషయమును, మేము చెప్పడముగాని, వ్రాయడముగాని ఎప్పటికి ఉండదు. అందువలన మా రచనలలోని పుస్తకములలో అన్ని క్రొత్త విషయములుగానే కనిపిస్తూయుంటాయి. కృష్ణుడు గీతను చెప్పాడు, అది అంతకు ముందు ఎవరు చెప్పినదికాదు, వ్రాసినదికాదు. ఏసుప్రభువు తన జీవితములో కొన్ని మాటలు చెప్పాడు, అవి ఆయనకంటే ముందు ఎవరు చెప్పలేదు. కృష్ణుడుకాని, ఏసుప్రభువుకాని ఎలాగ ఎవరిని అనుసరించి చెప్పలేదో, అలాగే మేము ఎవరిని అనుసరించి చెప్పలేదు. మాచే వ్రాయబడిన వ్రాతలన్నీ ప్రత్యేకతను కల్గియున్నవేనని అందరు గ్రహించవచ్చును. అదే పద్ధతి ప్రకారము గీత అంటే ఇంకా ప్రత్యేకముగా ఏమి చెప్పుచున్నామనగా!