పుట:Geetha parichayam Total Book.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ శాస్త్రమును భగవంతుని రూపముతో బోధించాడు. భగవంతుడు బోధించిన యోగశాస్త్రము మూడు భాగములుగ ఉన్నది. భూమి విూద కొన్ని దేశములలో యోగశాస్త్రము లోని ఒక భాగమును భగవంతుడు ఎక్కువగ బోధించాడు. ఏ దేశములో, ఏ భాగము అవసరమో, ఏ భాగమును అక్కడి ప్రజలు అర్థము చేసుకోగలరో, ఆ భాగమునే ఎక్కువగ బోధించాడు. భారతదేశములో మాత్రము యోగశాస్త్రములోని మూడు భాగములను బోధించాడు. ఇక్కడ మూడు భాగములలోని ఏ భాగమును అనుసరించినా మోక్షము పొందు అవకాశము గలదు. భారతదేశము ఇందూదేశము, అనగా జ్ఞానముకల్గిన దేశము. జ్ఞానమును అవగాహన చేసుకొను స్థోమత ఇందువులలో గలదు, కావున యోగశాస్త్రము యొక్క మూడుభాగములను సంపూర్ణముగ బోధించారు. యోగశాస్త్రములోని మూడు భాగములు వరుసగ 1) జ్ఞానయోగము లేక బ్రహ్మయోగము. 2) రాజయోగము లేక కర్మయోగము. 3) భక్తియోగము లేక విశ్వాసయోగము అనునవి గలవు. మూడు యోగభాగములు మూర్తీభవించిన యోగశాస్త్రము భారతదేశములోనే బయల్పడడము మన అదృష్టమేనని చెప్పవచ్చును. మూడు యోగభాగములలో స్వయముగ పరమాత్మ అంశయైన భగవంతుని చేత చెప్పబడిన యోగశాస్త్రమే భగవద్గీతా గ్రంథము.

స్వచ్ఛమైన యోగశాస్త్రమైన "భగవద్గీత" గ్రంథములోనే మిగతా దేశములలో గల ఇతర మత గ్రంథరూపములో చెప్పబడిన సారాంశము కూడా గలదు. కావున భగవద్గీతను ఏ మతస్థుడు, ఏ దేశస్థుడు ఖండించలేడు. వారి వారి మతములలోని సారాంశము భగవద్గీతలో ఒక భాగమైవుండడమే దీని ప్రత్యేకత. ఎంతో గొప్ప యోగశాస్త్రమైన భగవద్గీతలో కూడ కొందరు రచయితలు చెప్పిన భావములచేత దాని గొప్పతనమునకు ముసుగుపడు ప్రమాదమేర్పడినది. గీతకు భాష్యమును చెప్పిన వారికి భగవద్గీతలోని మూడు భాగములు తెలియక పోవడము, వారిలో పురాణముల భావములు ఇమిడివుండడము మరియు భగవద్గీత ఒక శాస్త్రమను విషయము కూడ వారికి తెలియక పోవడము,