పుట:Geetha parichayam Total Book.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఇక్కడ ముఖ్యముగ మేము చెప్పవలసిన విషయము, విూరు వినవలసిన విషయము మరొకటిగలదు. అదేమనగా! అష్ఠాదశ పురాణములని పురాణములు మొత్తము 18 గలవు. అవి వరుసగ 1) బ్రహ్మపురాణము 2) పద్మపురాణము 3) విష్ణుపురాణము 4) శివ పురాణము 5) భాగవతము 6) నారదపురాణము 7) మార్కండేయ పురాణము 8) అగ్నిపురాణము 9) భవిష్యత్‌పురాణము 10) బ్రహ్మకైవర్తన పురాణము 11) లింగపురాణము 12) వరాహపురాణము 13) స్కంధ పురాణము 14) వామనపురాణము 15) కూర్మపురాణము 16) మత్స్య పురాణము 17) గరుడపురాణము 18) బ్రహ్మాండపురాణము.

ఈ పదునెనిమిది పురాణములు పూర్వమునుండి పేరుగాంచియున్నవి. శాస్త్రములు, పురాణములలో మూడవ భాగము మాత్రము గలవు. పురాణములు 18 కాగ శాస్త్రములు కేవలము 6 మాత్రమే. శాస్త్రములకంటే పురాణములు సంఖ్యలో మూడింతలు పెద్దవైనప్పటికి విలువలో రాతికి రత్నానికి వున్నంత తేడా పురాణములకు, శాస్త్రములకు గలదు. 18 పురాణములకు లేని విలువ 6 శాస్త్రములకుండుట వలన ఆ విషయము పూర్వము కొందరికి జీర్ణము కానిదయ్యెను. పూర్వము కాలగమనములో పురాణప్రియులు ఎక్కువ, శాస్త్రప్రియులు తక్కువైనపుడు, అదే అదనుగ పురాణములకు విలువ చేకూర్చుటకు, శాస్త్రములకు విలువ లేకుండ చేయుటకు, పెద్దకుతంత్రము జరిగినది. శాస్త్రములను లేకుండ చేసి, శాస్త్రముల స్థానములలో మరో ఆరు విధానములను ప్రవేశపెట్టి, అవియే శాస్త్రములని ప్రచారము చేశారు. అలా మొదటి ఆరు శాస్త్రములు శాస్త్రములుగ ప్రచారము కాక, శాస్త్రములుకాని ఆరు శాస్త్రములు ప్రచారమైనవి. అవి వరుసగ 1) శిక్ష 2) వ్యాకరణము 3) చంధము 4) నిరుక్తము 5) జ్యోతిష్యము 6) కల్పము. ఈ కాలములో ఇవి అందరికి తెలియకున్నా వేదపరిచయమున్న వారికి, పురాణములలో పూర్తి మునిగిన వారికి బాగా తెలియును. శాస్త్రముల పేరుతగిలించుకొన్న వీటిలో ఉదాహరణగ ఒకదానిని వివరించుకొని చూస్తాము.