పుట:Geetha parichayam Total Book.pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మానవుని కర్మను తొలగించు స్థోమత వాటియందు లేకుండపోయినది. అందువలన వాటిని తెలియుట వలన కాలక్షేపమేగాని కర్మక్షేపములేదని, పూర్వము నుండి వాటికి గుర్తింపుగ ఒక పేరుపెట్టారు, దానినే పురాణ కాల క్షేపమన్నారు. పురాణ కాలక్షేపమను మాటతో వాటి వలన కాలము వృథా అగునని అర్థము. క్రొత్త విషయములను తెలియజేయడములో మానవున్ని మంచి మార్గములో నడుపుటకు ఉద్దేశించిన పురాణముల ప్రయోగము మానవున్ని పూర్తి కర్మవిముక్తున్ని చేయలేక పోయాయి. పురాణములకు పూర్తిగా అతుక్కుపోయిన వారికి ఈ విషయము కొంత బాధ కల్గించునదైనప్పటికి వారిని మాత్రము పురాణములు ముక్తులజేయలేవు. పురాణములకు పూర్వమునుండి పుక్కిడి పురాణములని నామము కూడ కలదు. నిజమైన విషయములు బొడ్డు దగ్గరనుండి వచ్చునని, కల్పితములు, అబద్దములు నోటిపుక్కిడి నుండి వచ్చునని కొందరి ఉద్దేశ్యము. మేము చిన్నప్పుడు పాఠశాలలో ఉన్నపుడు నిన్నటి దినము ఎందుకు రాలేదని మాష్టారు ఒక పిల్లవానిని అడిగినపుడు, ఆ పిల్లవాడు నిన్నటి దినమున నాకు తలనొప్పిగ ఉండెను, దానికి రాలేదనెను. ఆ మాటవిన్న మాష్టారు నీవు చెప్పుమాట బొడ్డు దగ్గర నుండి వస్తావుందా లేక పుక్కిడిలో నుండి వస్తావుందా అని అడిగెను. ఆ మాటలో అర్థము నీవు చెప్పుమాట నిజమైనదా లేక అబద్దమా అని అడగడము. దీని ప్రకారమే పుక్కిడి పురాణములనడములో అబద్దపు పురాణములని అర్థమవుచున్నది.

పురాణములు పుక్కిడినుండి వచ్చునవైతే, బొడ్డుదగ్గరనుండి వచ్చునవి శాస్త్రములని చెప్పవచ్చును. శాస్త్రములనగా శాసనములతో కూడుకొన్నవని చెప్పవచ్చును. "శాపము" అన్న పదము నుండి పుట్టినది "శాసనము". శాసనము అనిన, శాపము అనిన జరిగి తీరునదని అర్థము. శాసనములతో కూడుకొన్నది శాస్త్రము. శాస్త్రములోని ప్రతి విషయము సత్యముతో కూడుకొని ఉండును. ఒక్క మారు చెప్పబడిన శాస్త్రవిషయము ఎప్పటికి అసత్యము కాదు. ఉదాహరణకు అందరికి తెలిసిన గణిత శాస్త్రమును తీసుకొందాము. అందులో