నూతన సంస్కరణం సిద్ధించవలెను
సంఘమున కంతటికిన్నీ ఒక నూతన సంస్కరణము సిద్దించవలెను. ఇందుకై వయోజన విద్య తప్ప రెండవ మార్గం లేదు. ఇందుకై వలసిన బలగమింతా అంతా కాదు. విజ్ఞానవంతులగు యువకుల సహాయము మనము చూరగొనవలెను. రాష్ట్రీయ ప్రభుత్వ మీ యుద్యమమునకు సంపూర్ణదోహదము చేయవలెను. ఇంతమందిమి కలిసి పోరాడకుంటే ఈ అజ్ఞాన పిశాచమును మనము సంహరింపజాలము. దానిని సంహరించనిచో మన మీదాస్వాంబుదిని తరింపజాలము.
అన్ని ఉద్యమములకు విలేఖకులు ప్రాణము వంటివారు
ఏదేశమునకైనను, ఉద్యమమునకైనను ప్రాణములు లేఖకులే. వారి వ్రాతలను చదివియే, వక్తలు ఉపన్యసించుచుందురు. వారి గ్రంథములను పఠించియే, యువకులు, బాలురు, విద్యావంతులగుచుందురు. వారి బోధల నాలకించియే సంఘములు సంస్కరింపబడుచుండును. లేఖకుల తోడ్పాటు లేనిదే ప్రపంచములో నే యుద్యమమును ఇంతవరకు విజృంభించలేదు. ఇకముందు విజృంభించబోదు. ఫ్రెంచి విప్లవమునకు వాల్టేరు, రూసోలు, బ్రిటిషు విజ్ఞానమునకు బర్కు, రస్కిను, కార్లయిలు, మిల్లు మొదలగు వారి వ్రాతలు, రష్యా ఉద్యమమునకు అనంతకోటి లేఖకుల సిద్ధాంతములు, కథలు మన దేశములో కాంగ్రెసు యొక్క అఖండ విజయమునకు తిలకు, గోఖలే, అరవింద, మజుందారు, దాసు, బోసు నెహ్రూలు, గాంధీజీ, రాజాజీ, పట్టాభి మొదలగు వారి వ్రాతలు పునాదులు వేసినవి. మనకు ఆంధ్రదేశములో ఈ నవీన విజ్ఞానమును వెదజల్లుచున్న కవులు, గాయకులు, కథకులు, చరిత్రకారులు, పత్రికాధిపతులు, విలేఖరులు, విమర్శకులు, ప్రకాశకులు, మనలో నెందరో వున్నారు. వయోజన విజ్ఞానమునకు మన అందరి వ్రాతలును ఎంతో పోషకములయినందున నేనెంతయు వారిని అభినందించు చున్నాను.
ప్రోగ్రెసివు రయిటర్లు
మనమందరమును లేఖకులము. రసము లేని లేఖనము లేఖనమే కాదు.
గరిమెళ్ళ వ్యాసాలు
85