Jump to content

పుట:Garimellavyasalu019809mbp.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాష్ట్రము, ఒకే భాష, ఆంధ్రులు ఒకే జాతి అను భావము బాగుగా పాదుకొనినది. నేడు మనము దూరదూరపు బంధువులవలె చూచీ చూడనట్లు కాలక్షేపము చేసుకొనుటకు వీలులేదు. ఇంతకుముందు మనకిట్టి పరస్పర సంబంధములు తక్కువగ ఉండుట వల్లనే ఒకరికొకరము దూరస్థులవలె కనిపించితిమి. కాని రాకపోలు, ఉత్తర ప్రత్యుత్తరములు, సంబంధబాంధవ్యములు యెక్కువయై యుండినచో ఆంధ్రభాషలో ఇట్టి ప్రభేదము లుండకపోయెడివేమో?

ఈ భేదములను చెరుపుకొని మనమందరము నేకకుటుంబము వారమని గ్రహించవలసిన తరుణమిది. కనుక మీ ప్రాంతముమాట మాకు తెలియదు, కనుక దానిని వ్రాయకూడదు అని ఒకరినొకరమనుకొనకూడదు. ఏ మండలమునందలి పెద్దలు అక్కడి పరిభాషలో తమ సమస్యలను గూర్చి వ్రాయుచు ప్రసంగించుచు ఉండవలెను. తక్కిన మండలముల వారెల్లరును వానిని ఆనందముతో పఠించి గ్రహించుచుండవలెను. ఇట్లు ఒక పది సంవత్సరముల పాటు జరిగినచో ఆంధ్రుల పదబాహుళ్యము, విజ్ఞానము, పరస్పర స్నేహము, సంపద, సౌభాగ్యము వర్ధిల్లును. మనము తోడి జాతుల వారందరితో సమానులమై, భారతీయ నాగరికతకు పెట్టని కోటలము కాగలుగుదుము. గుజరాతీ, బెంగాళీ, హిందీ, మహారాష్ట్ర భాషల వారందరును ఈ రీతిగానే తమ విజ్ఞానమును, భాషలను, సమస్యలను, సర్వమును పరిష్కరించుకొని సత్వరాభివృద్ధిని పొందుచున్నారు. మనము కొన్ని పెడబోధనలు వినియో, వేరు చింతనలు చొక్కియో పాతిక సంవత్సరముల క్రిందట ప్రారంభించిన ఈ శుభ ప్రదాందోళనము యొక్క ఫలితమును నేటివరకును అనుభవింపజాలకున్నాము. ఈ విధమైన సర్వతోముఖాందోళనము జరుగుటకు భాషయొక్కటియే ప్రశస్త సాధనము. కనుక ప్రతిభాషాసేవకుడును తన చాకచక్యమును, ప్రతిభను, విజ్ఞానమును ప్రకటించుకొనుటకై భాష కెన్ని విధములగు చక్కని మార్గములను గూర్చవలెనో అన్నిటిని గూర్చగడంగును గాక! వచ్చీరాని జ్ఞానముతో తెలిసి తెలియని పదాలను ప్రయోగించి ఇదంతా భాషా సంస్కారమే అనిభావించుకొను వెల్తితనము లేకుంటే చాలును. భాషా పోషకమైన, ప్రతీ విధమైన మార్పునకున్ను స్వాగతం సుస్వాగతం!

-ఏప్రిల్, 1938. భారతి.

గరిమెళ్ళ వ్యాసాలు

79