Jump to content

పుట:Garimellavyasalu019809mbp.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇక శుద్ధ గ్రాంథిక భాషలో వ్రాయగలవారు అసలే శూన్యంగా వున్నారు. ఇదుగో నేను లేచానని యెవరైనా అన్నారా! 'దీనిలోని ప్రయోగాలు శుద్ధ తప్పులు, ఈ పదాలు కేవలం వాడుకలు ' అని యెవ్వరైనా చూపించవచ్చును. ప్రస్తుతం మన భాషాస్థితి ఈ రెండింటి మధ్యనా ఉఱ్ఱూతలూగుచున్నది. వ్యావహారిక భాషావాదము నంగీకరించకా తప్పదు. అంగీకరిస్తే దానికి హద్దులు నేర్పరచడమూ కష్టమే. ఉన్నవి అన్న శబ్దానికి ఉన్నాయి, ఉన్నయి, ఉన్నై మొదలగు ప్రాంతీయాలను వాడుతున్నారు. నిలుచుండు శబ్దానికి నిలుచొను, నిల్చొను, నించొను, నుంచొను, శబ్దములను వాడుతున్నారు. వెళ్ళిన శబ్దానికి వెళ్లితే, వెడితే శబ్దాలను కూడా వాడుతున్నారు. వేళకు జ్ఞాపకానికి రావు కాని ఇటివంటి ప్రయోగాలు వందలూ వేలు పత్రికలలో కనబడుతున్నవి. కొన్నింటిని చూచి రామమూర్తిపంతులుగారే ఆశ్చర్యపడుతున్నారు. అయినా ఏప్రాంతంలోనైనా సర్వసాధరణంగా వాడుకలో వుండే ప్రయోగాల్ని ఇతర ప్రాంతాల్లో లేవన్న కారణం చేత యెట్లా విడనాడగలము? బహుశా ఇల్లాగు రెండు మూడు శతాబ్దాలు వెళ్ళేసరికి ఇవన్నీ మనకు ప్రాతగిల్లి ఆశ్చర్యకరంగా వుండక పోవచ్చును. అంతవరకు యెవరెవరే భాషలో వ్రాస్తున్నా ఆక్షేపించడానికెవ్వరికీ అదికారంలెదు. వీనిలో కొన్ని కేవల ప్రాంతీయములు కొన్ని అఖిల ప్రాంతీయములు వుంటవి. కేవల ప్రాంతీయములను కాదని అఖిల ప్రాంతీయములను వ్రాసేవారిని మనము కొనియాడవలసినదే. అట్లు కాదని కేవల ప్రాంతీయాలను వాడే వారిని కూడా మన మభినందించవలసినదే. కలగా పులగంగా వ్రాసేవారిని కూడా మన మభినందించక తప్పదు. రాగా రాగా యేమిటి తోచుచున్నదంటే జనులు వ్రాసే భాషలను బట్టి మనమట్టే పేచీలు పెట్టుకోరాదనిన్నీ, వ్రాసిన విషయము యొక్క ప్రశస్తను గూర్చియే యోచించవలెనిన్నీ తోచుచున్నది. విషయమును బట్టి భాషయొక్క ధోరణి మారుతూనే వుంటుంచి. ఒక వ్యాసములోనే రెండు మూడు విషయములలాంటివి యెత్తుకోవలసి వస్తుంది. అటువంటప్పుడు ధోరణి కూడా మారుతుంది. ఈ వ్యాసంలోనే భాషల తత్వములు, ఆంధ్రభాష పరిణామములు, మొదలైన విషయములను తీసుకున్నప్పుడు ప్రారంభించిన దోరణికిన్నీ, వ్యావహారిక భాషావశ్వకతను నిరూపించవలసిన ధోరణి కిన్నీ యెంతో భేదము కనిపించుచున్నది. ఒకేధోరణిలో వ్యాసమంతా సాగింతామంటే సాధ్యమైనదికాదు. ఈ ఒక్క వ్యాసమునే కాదు. నేనే గ్రంథమును వ్రాతామని

గరిమెళ్ళ వ్యాసాలు

73