Jump to content

పుట:Garimellavyasalu019809mbp.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర భాషా పరిణామము


మానవులలో ఎట్టి పరిణామములు జరుగుచుండునో వారు మాట్లాడుచుండు లేక వ్రాయుచుండు భాషలలో కూడా అట్టి పరిణామములు జరుగుచుండుట సహజము. భరత ఖండము నందలి ప్రతి జాతియందును నేడు అత్యద్భుతమైన పరిణామములు జరుగుచున్నవి. ప్రాత విశ్వాసములపై ఒక వరుసనుండి విరోదము, కొత్త సూత్రములపై నొక వరుసనుండి విశ్వాసము లేచుచున్నది. ప్రాతదే పరమావధి క్రొత్తదెల్లయు నీటిబుడగవలె తాత్కాలికమను భావములు కూడా ఒక ప్రక్కను రేకెత్తు చున్నవి. ప్రాచీన నాగరికత లేని దేశములలో వలె మనదేశమువంటి దేశములలో క్రొత్త పద్ధతులపై దుర్దాహము ప్రబలుట సంభవింపదు. క్రొత్తదానిపై కెల్ల నెగబ్రాకగోరు కొందరు చపలురుండుచున్నను, అనతి కాలములో వారికే ప్రాచీన చైతన్యతా జ్ఞానముదయించి, వారి భావములను మధించి మరియొక నూతన మార్గమునకు వారలను త్రిప్పివైచును.

అయినను దేనిని కాని క్రొత్తదను నేకైక కారణమున తృణీకరించుట లెస్సయును కదు, సాధ్యమునుకాదు. ఎవరెంత గింజుకున్నను "క్రొత్తప్రాతల మేలుకలయిక క్రొమ్మెరుంగులు చిమ్ము" చునేయుండును. క్రొత్త దాని నేవగించుకొను వారును అవలంభించు వారును గూడ వాని తత్వము నామూలాగ్రముగా గ్రహించియే గర్హించుటయో. స్వీకరించుటయో చేయుచుందురు. మన భరతఖండమును, అందుగల వివిధ రాష్ట్రములును ప్రస్తుతము ఈ అవస్థయందే తటపటాయించుచున్నవి. ప్రాతవానిని విసర్జించుటకును వీలులేదు. క్రొత్తవాని ననేకమును స్వీకరించకయు తప్పదు.

ఈ విధమైన చైతన్యము వలన మన ఆంధ్ర భాష యెట్లు పలుభంగులుగా పరిణామము నందు చున్నదో గమనించుట యెంతయును అవసరము. ఈ పరిణామముల కన్నింటికి ఈ జాతీయ నూతన చైతన్యమే కారణమని చెప్పుటకు వీలులేదు. జాతులలో నిజాతీయసంబంధమైన నూతన సంచలనములు కలుగుచున్నను, మానుచున్నను కాలగమనమును పట్టి కూడా మార్పులును, పరిణామములును సంభవించుచునే యుండును. వేయి సంవత్సరముల క్రిందటి పదములును, ప్రయోగములును, వ్యాకరణ విశేషములును యెన్ని నేటికి

68

గరిమెళ్ళ వ్యాసాలు