పుట:Garimellavyasalu019809mbp.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాటికి ఆతిధ్యమిచ్చి ఆదరించుచున్నాము కాని పండిత నైజమగు తిరస్కార దృష్టితో గెంటివేయలెదు. అది మాస్వస్థాన మనియు జన్మభూమి యనియును మాతృమందిరమనియును, పాలకోశ మనియును తెలిసిన తరువాత మేము దాని దగ్గరకు రెక్కలు కట్టుకొని యెగరాలనుకున్నాము కాని, అదియే దీనదృక్కుల తోను, తెలివి నవ్వులతోను, చిన్ని నవ్వులతోను, చేయి దాచుకొని వచ్చుచుండగా ఎత్తిపట్టుకొని ఆదరించకుండుట కలదా! అందరికీ వారు పుట్టిన యింటిలోనే పెరిగి వృద్ధి నొంది పేరు మోయడం సహజమైతే, మాకు మెము పుట్టినిల్లదే అని తెలుసుకోవడమే ఆనంద కారణముగా వుంది. సహస్రకోటి కంఠములు కాదు కాదని కేకలు వేస్తున్నా ఒక్కడూ ఔను ఔను అని చేతులు రెండు యెత్తుతూ ప్రాత పత్రాల వేపూ దిద్దిన గ్రంధాల వేపూ శాసనాల వేపూ చరిత్రల వేపూ చూపెడుతూ మొర్రపెట్టి స్వస్థానము చూపించేడు. ఇల్లు గుర్తు పెట్టుకున్నాము గదా! ఇటువేపు దృష్టి తిరిగించి గదా! ఇంటిలోకి వచ్చి కూర్చోవడం సాధ్యం కాకపోయినా ఆ ప్రాంతాలనేనా తచ్చాడుతాము. అటువేపు చూడడమే భాషాద్రోహము, మహాపాతకం, అందవిహీనం అనే భయాలు పోయినాయి. పెక్కురకాల గ్రంధాలు, కవిత్వాలు విమర్శలు, శాస్త్రాలు బయలుదేరనున్నాయి. శ్రీ పంతులుగారు చూపించిన మార్గం రామసహాయమై వారి వేపు కృతజ్ఞతాదృష్టితో తిలకించేటట్లు చేయక మానరు. కొందరు ముందర వెళ్ళుతారు. కొందరు తాపీ పడతారు. కొందరు తొందరపడుతారు కొందరు నిక్కి నిక్కి వెనక్కి నక్కుతారు కొందరు సంతొషిస్తూ వెళుతారు. కొందరేడుస్తూ జారుతారు కాని అందరూ కూడా ఆ స్వస్థానానికే ఆ చుట్టుపట్లకే పొగలరు? లేకుంటే వీళ్లెవరో అక్కడి వాళ్లకే తెలియడమేలాగా!