పుట:Garimellavyasalu019809mbp.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విపరీతము. అసలు ఆంధ్రభాషయే మిశ్రభాష. కొన్ని సంస్కృత సంప్రదాయములను, కొన్ని ద్రవిడ సంప్రదాఅయములను గూడి అది యేర్పడినది. అసలు ఆంధ్ర భాషయో, యెదో ఇవి రెండును కాదని దాని విశిష్ఠ లక్షణములు ఏమిటో తెలుసు కొనుటకు చారిత్రక పరిశోధనల కైనను సాధ్యమగునో కాదో! ఇట్టి సందర్భములో ప్రస్తుతపు తెలుగులో పరిపాటియై యున్న పదములు, వృత్తములు, నడకలు మొదలగునవెల్లయును వాటి వాటి వ్యుత్పత్తు లెట్టి వైనను ఆంధ్రభాషలు, ఆంధ్రచందస్సు, ఆంధ్రరీతి యనుకొనవలసినదే. పాటలుకాని యిట్టి చందస్సులలోకి కూడా కవులు వాడుక భాష లోని రీతులు చొప్పించి యున్నారు. బాగుండని చోట బాగున్నయి కానందుమే కాని, అట్టుల జొప్పించకూడదని చెప్పి కవి స్వాతంత్ర్యమునకు మేమడ్దురాము. ప్రస్తుత భావకవీశ్వరుల పద్యములలోని రసస్ఫుటత్వము, భాషసహజత్వము, కవిత్వపు పాకము, మొదలగు వానిని గూర్చి మాకు కొన్ని సందియములుండవచ్చును గాని వారు తీసుకొనుచున్న భాషా స్వతంత్ర్యములను గూర్చి మేము తగవులాడం. భాష శరీరము, భావము హృదయము శరీరము చక్కగను లలితముగా నున్నది. ఆ హృదయమునకు గ్రహించుటకు మా హృదయము కూడా తడువులాడుకొనుచు అనేక చోటుల విసిగి, విహ్వలయై, చీకాకుపడి, యేమియును గానక కాల వ్యయమునకై విచారించి వెనుకకు వచ్చుచున్నది. ఆహృదయమునకు కాంతి నద్దవలెను. ఆ హృదయము విషాద విచార శోక దందహ్యమానమై గాఢాంధకారం కంటేను కాఱునలుపుగ నుండవచును కాని కవి యొక్క కవిత్వపు కాంతితో కూడ దాని వైపునకు ఇంచుక జ్ఞానవంతుడగు పాఠకుడు తొంగి చూడలేకున్నచో అది వ్రాయకున్నచో గలుగు గొఱంతయేమి? నేనెవ్వరికొఱకై కాని వ్రాయలేదు. పిట్టవలె అవ్యక్తముగా పాడుకున్నాను. ఆ ఆనందము నాకున్నది. దేశమునిండ పత్రికలును అఛ్చాఫీసులును నున్నవి కనుక పంపించి నాపేరుతో అచ్చువేయించుకొన్నానన్నచో విమర్శకుడు దానికొరకై సిరా దండుగ చేసి పాళీ మొద్దు చేసికొననక్కరలేదు.