Jump to content

పుట:Garimellavyasalu019809mbp.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మిశ్ర కావ్యములు

ఇక మిశ్ర కావ్యములను గూర్చి యాలోచించ వలసి యున్నది. హరికథలు, భాగవతములు, బొమ్మలాటలు, మొదలగునవి పద్య గద్య గీత మిశ్రితము లనుట కాటంకము లేదు. అవి అట్లే యుండవలె ననుటలో కూడ నందరును నేకగ్రీవముగా నొప్పుకొనుచున్నారు. హరికథలలో మనమెల్ల కత్తులను జొప్పించినను, బొమ్మలాటలు, భాగవతములలో మాత్రము పూర్వపు కత్తుల నింకను నుంచి వాటి విశిష్టత్వమును నిలబెట్ట వలసిన యావశ్యకత యున్నదనియే మా విశ్వాసము. మునుపటి కలాపములను రామ బాణముల నోటిలో నుండి తప్పించి యిప్పటి యాటగాండ్ర గాత్రములలో నుంచవలెను. అవసరమైనచో యీ దేశ కాల పరిస్థితులకు సరిపోవునట్లు కథా క్రమములు మార్చుచుండవలెను. వాటిలో పూర్వం నుండి వచ్చెడి నాగరికములగు హాస్యములను తగ్గించి సత్సదస్యులును కులాంగనలును వినుటకు యోగ్యమైనంత సరసములు చేయవలెను. వాటిలోని హస్యములు ప్రస్తుత పద్దతులను విమర్శించు చుండవలెను. నాటక ప్రదర్శనములను గూర్చి ఎంత పరిశ్రమము తీసుకొనుచున్నామో అంతకు మరింత పరిశ్రమము దీనిని గూర్చి మనము తీసుకొనవలెను. వీటికి కాలానుగుణ్యముగ నొక యాకారము వచ్చి యానాగరికజన హృదయరంజకములుగా చేసి విడిచిపెట్టినచో, మన పూచీ లేకుండా వాటంతట నవియే సమస్త శుభకార్యములయందును దేవతోత్సవముల యందును ప్రాకిపోగలవు. ఇవి నాటకముల కంటెను, భావకవిత్వముల కంటెను, బలతరములై ప్రజలకెక్కువ బాగుగ నచ్చి, దేశమున కెక్కువ సేయుననుట కభ్యంతరము లేదు. పూర్వ మివియే భారతవిజ్ఞానమును సంప్రదాయములను, ఆచారములను, వీర పరాక్రమములను, దేశ మతాభిమానములను, దైవభక్తిని, రాజనీతివిజ్ఞానములను, వేదాంతరహస్యములను దేశమునందెల్ల వెదజల్లు చుండెడి ఖర్చులేని విశ్వ విద్యాలయములు (యూనివర్సిటీలు) అయి యుండెడివి ఇట్టి జ్ఞాన ప్రచారకములైన సాధనములను విరగద్రోయుచు విద్యాభివృద్ధియు దేశాభివృద్ధియు చేసుకొనుచున్నామని సొమ్ము దండుగ పెట్టికొనుచు యౌవనము వమ్ముచేసుకొనుచు, స్వాతంత్ర్యము చౌక చేసుకొనుచు, దాస్యమే పరమావధిగాను, గౌరవముగను భావించుటకంటె అవివేకము వేఱొకటి లేదు.

12

గరిమెళ్ళ వ్యాసాలు