Jump to content

పుట:Garimellavyasalu019809mbp.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముగా చేసుకొనుట భావకవిత్వపు లక్షణమని మేము తలంచము. మానవ స్వభావములకు, ఊహాగమనములకు, యుక్తజ్ఞానములకు, కవితా సంచారములకు చిట్టి చిట్టి భేదములు కొన్ని యున్నను వ్రాసి పెట్టి నిర్ణయింపఁజాలనట్టియు, విశాల విమర్శక దృష్టి కలవారికి తమంతట తామే గోచరించునట్టియు కొన్ని జాడలున్నవి. వాటిని కూడఁ జూడ లేక కాని, లక్ష్యపెట్టక కాని కలమునకు వచ్చినట్లుగను, అల్పజ్ఞత్వమునకు తోచినట్లుగను, అహంకారములకు సరిపడునట్లును స్వాతంత్ర్యమను పేరిట స్వైర విహారము నొనర్చుచుండు అనేకము కుప్పకుప్పలు ఖండకావ్యము లెల్లను అనతి కాలములో మఱువబడును. మన ఆధునిక భావ కవిత్వములలో అట్టి విశాల సూత్రముల కొప్పునట్టివియు పెక్కులున్నవి. ఒప్పనట్టివియు అంతకన్న పెక్కులున్నవి. ఈ కవుల పద్యములను ప్రత్యేకము ప్రత్యేకముగా పట్టుకొని, నిస్వార్థ దృష్టితో పరిశీలించి యీ విభేదము నీయగల భారము విమర్శక శిఖామణులపై నున్నది. ప్రస్తుత సందర్భములలో భావకవిత్వరచనము కంటె కూడ యీ విమర్శక కార్యము తొందరగాపూనవలసిన ఆవశ్యకత లేకపోలేదు. విమర్శకు లించుక నిష్పక్షపాతముగ నీ పనికి బూనుకొనిన యెడలను, కవులించుక నిగ్రహముతోను, తమ రచనలను దీర్ఘకాల జీవముండవలెననెడి ఆశతో వ్రాసిన యెడలను నీ పని చక్క పడక మానదు.

గీత కవిత్వము

భావ కవిత్వములో కంటె గూడ గీత కవిత్వ మీ యుగములో పొందిన యభివృద్ధి యెక్కువ ప్రశంసనీయముగా నున్నదని దేశమెల్లను నంగీకరించుచున్నది. ఈ రంగములో నాచార్యపీఠము నారాయణదాసు గారి కిచ్చుటలో వెనుకకు గొంకెడు వారెవ్వరును లేరు. సహజముగనే గీత కవిత్వము పద్యకవిత్వము కంటె నెక్కువ హృదయరంజకముగను రమణీయముగను నుండును. దానికి చక్కని కట్టుబాటులున్నవి. దానిలో నుంచి తప్పుకొందమన్నను సాధ్యము కాదు. లయనుంచి అది తప్పుకొనలేదు కదా! సంగీతమందులో నిమిడియే యున్నది గదా! ప్రాసములను, నంత్యప్రాసములను వాటంతట నవియే పడును కదా! ఎంత తాపీగాపాడి యెంత గాన శక్తి చూపించి యెన్ని యెడుపులు, కళలు వేసినను నది

గరిమెళ్ళ వ్యాసాలు

9