Jump to content

పుట:Garimellavyasalu019809mbp.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అందరికీ తన్ను మాలిన ధర్మమేమిటనే యేకైక చింత పట్టుకొన్నది. లోక కళ్యాణం కంటే స్వీయ కళ్యాణం యెక్కువ ప్రధాన మనుభావము పాదుకొనివున్నది. ఎవరిని తప్పు పడదామన్నా ప్రతీవ్యక్తిలోనూ యేదో ఒక లొసుగు ఉంటునే వున్నది. లోకంలో కపట శాంతిని నిలబెట్టి ఈ కపట నాటకమును సాగించడం కోసమే నేటి సంస్థలన్నీ తోడుపడుచున్నవి క్రొత్తవి నిర్మించబడుచున్నవి.

కనుకనే నిర్గందకుసుమాల కున్న గౌరవం సురభిళ పుష్పాలకు లేక పోతున్నది. సురభిళ పుష్పాలన్నీ యేయరణ్యములోనో ప్రతి ఉదయమునను పూచి ఆఘ్రాణించే దాతలు లేక సాయంకాలమునకు రాలిపోవుచున్నవి.

అధవా యీ లోకంలోకి వచ్చి కాస్త సువాసన విరజిల్ల ప్రారంభించేటప్పటికి మామూలు నేరగాళ్ళలాగే బంధిఖానాలలో బంధింపబడుచున్నవి. ఇదంతా ప్రజారక్షక శాంతి పోషక ప్రభుత్వ చట్టాల విశాలాశ్లేషణల క్రింద జరుగుచున్న మహాతంతుగా పరిణమించుచున్నది. ఇదే ధర్మమై నేడు లోకమును ప్రభుత్వ విధానములను ధరించుచు భరించుచున్నది. ఇదికూడా కూలిపోతే ఈ మాత్రం ప్రపంచమైనా నిలువదను భయము ప్రతీ పెద్దను ఆవరించి యున్నది. ఇట్టి ప్రపంచం కూలిపోతే సృష్టికి వచ్చే ముప్పేమిటో యెవ్వరును చెప్పజాలకున్నారు.

అయినా సృష్టి మహా చిత్రమైనది. నిలబడుమని మనము కోరితే నిలిచేది కాదు. కూలమని శాసిస్తే కూలేది కాదు. ప్రకృతి దేవత మహాబలీయమైనది. దానికి జ్ఞానం లేదని, మానవుడెట్లు నలిపి పాడుచేస్తే అట్లల్లా లొంగుతూ దాసోహం చేస్తూ వుంటుందని విజ్ఞానులు భ్రమపడుచున్నారు. విజ్ఞానుల విజ్ఞానము కతీతమైన మహాప్రజ్ఞలు దానికున్నవి. ఇవతల మనము విజ్ఞాన డోలికలలో అంబరవీధిలో ఊగుతూ వుండగానే అది మనను అధఃపాతాళములోనికి త్రోయగలదు.

ఒక్కొక్క వేళావిశేషంలో ఈశ్వరుని సహితము మాయ గ్రమ్మి లోబరచుకొనగల మహాశక్తి ఈ ప్రకృతికి ఉన్నప్పటికి రేఖ మారినప్పుడది యీశ్వరుని శాసనమునకు లొంగి పాదాక్రాంతురాలు కావలసినదే.

172

గరిమెళ్ళ వ్యాసాలు