Jump to content

పుట:Garimellavyasalu019809mbp.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గొడ్డలిపెట్టులు కనుక అట్టి విశాలతత్వ వాసనలను రూపుమాపుటే పై వర్గాలందరియొక్క సమానాశయం. వారి ధర్మమంటూ జన సామాన్యంలో కూడా దేశాభిమానము మొదలగు ఉత్తమాశయముల యందు కంటె స్వార్థపరాయణత్వమున కగ్రతరస్థానం లభించినది. కనుక వారి మాటలు పథ్యములైనట్లు ఇతర విశాలాశయుల మాటలు పథ్యములు కావు.

ఈరకం మూకల గూడుపుఠాణీల ద్వారానే నేటి నాయకులు పైకి తేలుతూ వివిధస్వార్థ సాధకమైన ఈ ప్రజా పరిపాలనా తంత్రమును "జయప్రదముగా" సాగించుకొని పోవుచున్నారు. కాని ఈ గూడుపుఠాణీ లన్నిటికి కీలక పరిశ్రమ ధనాశా పరాయణత్వమే కనుక దానిలో ధర్మవాసన లేశమైనా లేదు కనుక నేటి సంఘమయినా లోలోన నగ్నిచే కుములుచున్న అగ్ని పర్వతముతో తుల్యమైయున్నది.

అది ప్రేలనే ప్రేలకూడదు. కాని ప్రేలినా యెన్నో దుష్ట సంస్థలతో పాటు, వాటికంటే ముందుగా కూడానేమో, అనేక సత్సంస్థలు కూడా దగ్ధమగును. కాని ఆ పరిస్థితి తప్పని సరియగు నేమో అని భయమగుచున్నది. అది తప్పుట కొక్క మార్గమున్నది. కాయా, మనసా వాచా జనులందరూ డబ్బుకోసం కాక ధర్మం కోసం పంటలు పండించుచున్నామనీ, ఉద్యోగాలు చేస్తున్నామనీ, తీర్పులు చెపుతున్నామని, పాఠాలు బోధిస్తున్నామని, చదువులు చదువుతున్నామనీ, దివ్యస్వప్నములు కంటూ తదనుకూలముగా వర్తించడం నేర్చుకోవాలి. ఇప్పటి స్థితిలో ఈ తత్వం, మానవలోకం మాట అటుంచి, భారతీయ విద్వల్లోక మనబడే వారికైనా తలకెక్కడం కష్టం.

డబ్బుమీద శ్రద్ధ తగ్గించి లోకహితంమీద దృష్టి నిగిడించమంటే, బిర్లాకెంతకోపమో, ఫ్యాక్టరీ కార్మికునకు అంతకంటే యెక్కువ కోపం. హైకోర్టు జడ్జికి జిల్లా కలెక్టరుకు యెంత కోపమో తపాలా బంట్రోతుకు అంతే కోపం. జవహర్లాలు కెంత కోపమో రాజాజీ, పటేలు, మత్తయి, అజాద్‌లకు కూడా అంతే కోపం

డబ్బాస లేకుంటే మానవ ప్రకృతి చిన్న మెత్తు పని చేయదను

గరిమెళ్ళ వ్యాసాలు

167