Jump to content

పుట:Garimellavyasalu019809mbp.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొనుక్కోలేని సరుకును తూము కాలువలలో పోసినా వారికి కలిగే కుందకమేమీ లేదు.

వాణిజ్య విధానములో ఇంతకంటె అరాచకము లేదు. ఈ అరాచకము వల్లనే వర్తకులు బాగుపడుతూ, ప్రభుత్వానికి పెద్ద పన్నులు చెల్లించి, అది ఖర్చులు భరించి సాగుటకు సాయపడుతున్నారు. కనుక, ప్రభుత్వములు రహస్యముగా వారినే బలపరచుచున్నవి. ఇట్లు వర్తకులును ప్రభుత్వములును కలిసి ప్రజల ప్రాణమానములు హరించుచున్నారు. ప్రభుత్వములు వర్తకులు చేస్తున్న ఈ అరాచకము నింత సహిస్తూ కూడా, ప్రజలిందుకు విరోధముగా ఏమాత్రమాందోళనము చేసినను చెవిని పెట్టకుండుటయే కాక, వారినే అరాచకులుగా భావించి కేసులు పెట్టి జెయిలు శిక్షలు విధించుచున్నారు.

ఇదంతా ప్రభుత్వముల లోపముకాక వేరు కాదనుట స్పష్టము. ప్రజలలో అరాచకమనుకొనేదానిని అణచుటకు ఇన్ని ఆర్డినెన్సులు ప్యాసు చేస్తున్న ప్రభుత్వములు వర్తకులు చేస్తున్న ఈ అరాచకము నణచడానికి ఒక్క ఆర్డినెన్సు ప్యాసు చేయజాలరా? ఆ అరాచక మణగితే ఈ అరాచకము సమ్మెలు మొదలైన వేవీ కలికానికైనా కానరాకుండ హరించేవే!

రేషనింగు కంట్రోలు ఉన్న రోజులలోనే కాస్త నయముగా వుండేది. చాలీచాలని తిండి బట్టయైనను అందరికీ వుండేది. గాంధీ మహాత్ముని ఆందోళన వలన కంట్రోళ్లు తీసినప్పటినుంచి ఖరీదులు నాలుగురెట్లు పెరిగినవి. వర్తకులలో ఏదో నీతి వున్నదనీ, దానినిబట్టి ప్రజాశ్రేయస్కరమై తమ కనుకూలమగు లాభములు కలిగేటట్లు, వర్తకులు అమ్మగడంగుదురనియు గాంధీజీ భ్రమపడినాడు. ఆభ్రమ విచ్చిన్నం కాక ముందే ఆయన మరణించాడు.

తిరిగి కంట్రోళ్ళు పెట్టడమా మానడమా అనే సమస్యలో ప్రభుత్వములు పడినవి. కంట్రోళ్ళు రేషనులు పెట్టినా పెట్టకపోయినా కూడా ప్రజలకు నష్టమే. రేషనుంటే దొంగబజారులో కొనుక్కుని దొరికి జెయిళ్ళ పాలు కావాలి. లెకుంటే బహిరంగ బజారు ఖరీదులు చెల్లించలేక జనులుమాడాలి.

ఇందుకై ప్రభుత్వములు వర్తకులపై చర్యలకు పూనుకోవాలి. ప్రాతవారి

గరిమెళ్ళ వ్యాసాలు

155