వృత్తి మొదలు పరమోత్తమమైన మతాచార్యవృత్తి వరకు సర్వమును ద్రవ్యోపార్జనకు దర్జాజీవనమునకు కృత్రిమ కీర్తికి పీఠములుగా ఒనరింపబడినవి. ఏదో ఒకటి - అనగా మానమో ఆఖరుకు ప్రాణమైనా సరే - చదువో - సేవో - నీతో ధర్మమో - అమ్ముకొని డబ్బు సంపాదించుకొంటూ దర్జాగా బ్రతుకుతున్నవాడు చెప్పే మాటకే విలువ ఉంది. కాని ఈ కృత్రిమ మార్గములు లేక ఆ దర్జాకు రాజాలని వాడు చేప్పే మాటలకు వెండ్రుక వాసి విలువ లేదు.
క్లిష్ట సమస్య
ఈ మోస్తరు ప్రపంచపరిస్థితులలో గ్రామాలలో నిర్మల జీవము నిర్మల విజ్ఞానము నిర్మలమగు ఆశయములు నెలకొల్పడమనేది మీది మీది మాటకాదు. ఒక ప్రక్కన దొంగలు దూరి యిల్లు దోచుకుంటూవుంటే యింకొక వరుసనుండి వెండి బంగారములు ఊరుకొంటూరావు. ఒక ప్రక్క నుంచి కుష్ఠు రోగము దేహము యొక్క అంగములను కొరుకుకొనిపోతూవుంటే ఇంకొక ప్రక్క నుంచి భూకంపము మేడలను మిద్దెలను నగరములను నిర్మూలము చేస్తూ వుంటే ఆ శిథిలములలో నుంచి క్రొత్త సౌధములు నగరములు పుట్టుకొంటూ రావు. ఒక ప్రక్క నుంచి గ్రామము లోని ధన ఆరోగ్య నీతి ప్రకృతి విలాస సంపదలను నగరములు కొల్లగొడుతూ వుంటే వేరొక ప్రక్కనుంచి ఆ గ్రామములలో అవి ఊరుకొంటూ రావు. రాఘవాస్వస్తి రావణాస్వస్తి అనుటకు వీలులేదు. నగరముల దృక్పథము మారకుంటే గ్రామములు యెత్తిరిల్లజాలవు. గ్రామసంస్కారమునకు ముందు నగర సంస్కారమే ప్రారంభము కావలెను. నగర సంస్కారమనగా మరిన్ని మరలు, మరిన్ని యంత్రములు, మరింత వర్తక దృష్టి మరింత దోపిడిమార్గము అని అర్థము కాదు. నగర సంస్కారణమనగా నగరముల నగరవాసుల నగరముల పెద్దల ఉద్యోగస్థుల దృక్పథము నందే సంస్కరణము. ఇది లేకుండా చెప్పే గ్రామ సంస్కరణపు మాటల వల్ల గ్రంథాల వల్ల ఉపన్యాసాలవల్ల మరింత ముప్పే కాని కించిత్తు ప్రయోజనము లేదు.
148
గరిమెళ్ళ వ్యాసాలు