Jump to content

పుట:Garimellavyasalu019809mbp.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చావనూ చావదు; మిశ్రమ ప్రాంతాలు, జాతులు, తెగలు లేకుండాను పోవు. కేవలం మిశ్రమ ప్రాంతాలలోనే కాక ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా తమ యిరుగుపొరుగుల, నాతిదూరస్థ ప్రజలతోనే గాక వివిధ దేశ ఖండస్థులతో కూడా అన్యోన్య సంపర్కం యెంతో అవసరం. అది సాధారణ సందర్భాలలో సాధ్యం కాకపోయినా, కొన్ని కొన్ని సందర్భాలలో సంభవించుచునే యున్నది.

ప్రపంచదేశాలలో పరస్పర సంస్కృతి సంపర్కం

ఒకప్పుడు రాజులు దండయాత్రలు చేసి దూరస్థ ప్రదేశాలను జయించేవారు. ఆయా దూరస్థ దేశ ప్రజలు విజేతలను అప్పుడు శత్రువులుగా పరిగణించినా ఆ శత్రుత్వాలు స్థిరీభూతము లయ్యేవి కావు. విజేతలకు పాలిత ప్రజల సహకారము వారి నానందింపచేయడము అవసరమయ్యేది కనుక వారు త్వరగా మిత్రులుగా మారేవారు. తదనుగుణ్యంగా పాలిత ప్రజలను యెడతెగని వైరమును పూనక రాజు అను పేరు పెట్టుకొని చక్కగా పాలించువాని కెల్ల విధేయులుగానే ఉండేవారు. పరస్పర స్నేహంతో బాటు పాలక వర్గ లక్షణాలు పాలిత వర్గాలకు పాలితవర్గ లక్షణాలు పాలకవర్గాలకు సంక్రమించేవి.

నాటి రాజుల దండయాత్రలు కేవలం ఘాతుకత్వ దుర్దాహప్రేరితములు కావు. "ఆసంతృప్తర్ద్విజానష్టః సంతృప్తారివపార్థివః" అను సూత్రము ననుసరించి ఒకానొక విజయాపేక్షతో సవ్యమైన సూత్రము ననుసరించి శాస్త్రీయ పద్ధతిపై జరిగినట్లు కనిపించుతుంది. ఆ రాజుల వెనుక ఆ దేశపు పండితులు వైతాళికులు పరివారాలు (నటనకత్తెలు కూడా) తరలి వెళ్ళేవారు. యుద్ధంలో గెలుపో ఓటమియో స్థిరపడేదాకానే శతృత్వంకాని, యెవరికో ఒకరికి ఏదో యొకటి సంభవించగానే విరోధాలకు స్వస్తి, విజయోత్సావాలలో ఉభయులు పాల్గొనడాలు, పరస్పర స్నేహమునకు పునాదులు పడేవి. నాటినుంచి ఆ దేశాల మధ్య రాయబారాలు, వాణిజ్యాలు, పండిత సంచారాలు, విజ్ఞాన పరిచయాలు, కళాసమ్మేళనాలు జరుగుతూ వుండేవి. మన దేశ కళలలో శాస్త్రాలలో కొన్ని గ్రీకు పోలికలను, వారి కళలు భాషాశబ్దములు మొదలగు వానిలో కొన్ని భారతీయ లక్షణాలను పోలికలును కలగడానికి కారణం

128

గరిమెళ్ళ వ్యాసాలు