పుట:Ganavidyavinodini.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓంకార

నాదోత్పత్తిక్రమములు

శ్లో|| చైతన్యం సర్వభూతానాం నిర్వృత్తి ర్జగదాత్మనాం |

నాదబ్రహ్మ తదానంద మద్వితీయ ముపాస్మహే ||


గీతమును నృత్యమును వాద్యమును జేరి సంగీత మనబడును. "నాదోపాసనయా దేవా బ్రహ్మవిష్ణు మహేశ్వరాః " "వీణావాదన తత్వజ్ఞః" అనెడి ఈ వచనముల ప్రకారమున శ్రుతిజాత్యాది మార్గములచేత నాదోపాస్తిని జేయవలయును.


నాదము పుట్టిన వివరము : ఈ యాత్మ స్వవిచారముచేత మనస్సును ఉధ్బోధించును. ఆ మనస్సు శరీరమందున్న అగ్నిని ఆయగ్ని వాయువును ప్రేరేపించును. ఆత్మ, మనస్సు, అగ్ని, వాయువు ఈ నాలుగును కారణములై నాదమును బుట్టించునని తెలియవలయును. బ్రహ్మ గ్రంథి యందున్నట్టి నాదము ఊర్థ్వముఖమై హృదయము కంఠము మూర్థమునను వీనియందుఁ బ్రవర్తించుచున్నది.


నాదమనఁగా "న" అను అక్షరము ప్రాణమనియు "ద" యనునక్షరము అగ్నియనియుఁ జెప్పఁబడును. ఈ కారణమువచేత ప్రాణాగ్నుల సంయోగముచేత నాదమని చెప్పఁబడుచున్నది.


స్వరోత్పత్తి స్థానములగు నాడులు హృదయమందు ఈడయు కంఠమునందు పింగళయు మూర్థమందు సుషుమ్నయు నని యుండును. దేహము నాడులతో నొప్పియుండినట్లె వీణాదండమును ఒప్పియుండును. వీణ ధ్రువమనియు చలమనియు రెండువిధములు. వీనివివరము సంగీతరత్నాకరమందు విశదమగును.