పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవాలయ ఆవరణలోని శాసనాలు

దేవాలయానికి ఈశాన్యదిశలో నవగ్రహమండపానికి దగ్గరలో నలుపలకలుగా వున్న రెండు శాసన స్తంభాలున్నాయి. అవి చాలాకాలం క్రితం దేవాలయాన్ని శుభ్రంచేస్తున్న క్రమంలో ఆలయ ఆవరణలో దొరికాయట. వాటిని సిమెంటు చేసి నిలబెట్టారు. నల్లరంగు వేసి వున్నాయి. గణపతిదేవుడు, శివలింగము, ఆవుదూడ, సూర్యచంద్రులు, గరుత్మంతుడు వంటి బొమ్మలు శాసనంపై వున్నాయి.

కాకతీయుల శాసనాలు చాలా వరకూ దానశాసనాలే. ఈ దానం చేయడం వెనక చాలా కారణాలు వుండేవి. దేవాలయాలలోని దూప దీప నైవేద్యాల నిర్వహణకు, దైవసంబంధమైన పండుగలకు, వేడుకగా చేయాల్సిన పనులకు, దేవాలయానికి అవసరమైన మానవవనరులు అంటే పూజారి మరియు ఆలయాన్ని శుభ్రపరచేవారికి, సంగీత వాయిద్యాలను మ్రోగించటం లాంటి పనులను చేసేవారికోసం కొంత భూమిని దేవాలయ ఆస్తిగా తీసిపెట్టారు. దానిపై వచ్చే ఆదాయాన్ని నిర్వహించుకునేందుకు ఒప్పంద పత్రాలుగా ఈ శాసనాలను వేయించినట్లు తెలుస్తుంది. అందుకనే శాసన పరిభాషలో ప్రధానంగా ఆచంద్రార్కం, చంద్రార్కస్థాయిగా, ఆదిత్య చంద్రులు కలయంత కాలము, చంద్రజలార్క తారకము, నింగి శశులు కలయంత కాలము వంటి పదబంధాలు కనిపిస్తాయి.

గుడి ఆవరణలో వున్న శాసన పాఠంలో కొండప్పుర వరాధీశ్వర అని వుంది అంటే ఇందులోని కొండపురం ఇప్పటి నేలకొండపల్లే అయివుండవచ్చు.