పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. రాజ్యంలోని భూమి అంతటికీ రాజే యజమాని కాబట్టి, రాచభూములను సగం ఆదాయాన్ని చెల్లించే రైతులకు (అర్థసీరులు) కౌలుకు ఇచ్చారు. చివరి పద్ధతిని ‘అడపగట్టు’ అనేవారు.

కాకతీయులు చేపట్టిన ఇటువంటి సంస్కరణల వల్ల చెన్నూరు, పాలంపేట, పాకాల, మంథని, ఏటూరు నాగారం, కొత్తగూడ, ఎల్లందు, బయ్యారం, అమ్రాబాద్, శ్రీశైలం ప్రాంతాల్లో కొన్ని లక్షల ఎకరాలు భూమి కొత్తగా సాగులోకి వచ్చినట్లు, ఆయా ప్రాంతాల్లోనే కొన్ని వేల గ్రామాలు ఏర్పడినట్లు, ఆయా ప్రాంతాల్లో దొరికిన శాసనాలు విశదం చేస్తున్నాయి.

పర్యాటక ఆకర్షణగా పాలేరుజలాశయం

గణపేశ్వరాలయానికి చాలా దగ్గరలోనే పాలేరు జలాశయం వుండటంతో చాలామంది గణపేశ్వరాలయంలోని శివుడిని దర్శించుకోవడంతో పాటు దగ్గర్లోని పాలేరు జలాశయాన్ని కూడా సందర్శిస్తుంటారు. అక్కడి సరస్సులో బోటింగ్ సదుపాయాన్ని వినియోగించుకుంటారు. ఆలయానికి అనుబంధంగా నిర్మించిన గంగాదేవి చెరువును పునరుద్ధరణ చేస్తే మళ్ళీ ఇక్కడ పాడిపంటలు పెంపొందుతాయి. గ్రామం సస్యశ్యామలం అవుతుంది. పర్యాటకానికి మరింత ఆకర్షణీయంగా మారుతుంది.

కూసుమంచి సందర్శన ఒక మరచిపోలేని అనుభూతి

చక్కటి ప్రశాంత వాతావరణంలో ప్రాచీన శిల్పనైపుణ్యాన్ని, ఆధ్యాత్మిక శోభను ఒకసారి చూసి తరించటం ఎవ్వరికైనా ఒక మరచిపోలేని అనుభూతినిస్తుంది. చరిత్ర విద్యార్ధుల అధ్యయనానికి అనువైన సమాచారమూ లభిస్తుంది. ఖమ్మంజిల్లా పర్యాటక రంగంలో సగర్వంగా చెప్పుకోదగిన ఈ ప్రాంతాన్ని తప్పనిసరిగా ఒక్కసారైనా చూసితీరాల్సిందే.