పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోధుల ప్రస్తావనలు కనిపిస్తాయి. వ్యవసాయం నమ్మకంలేని పరిస్థితిలో కత్తి పట్టడం వచ్చిన క్షత్రియులు కానప్పటికీ ఇతర వర్ణాల యువకులు ఎందరో ఆ దారిపట్టారు. స్వతంత్రంగా ఏ రాజుకూ లోబడక వీరభోజ్యంతో కడుపు నింపుకునే తెలుగు వీరులను ‘‘ఒంటర్లు, ఎక్కట్లు’’ అని పిలిచారు. ఈ పదాలే సాహిత్యంలో సంస్కృతీకరించబడి ఏకాంగ వీరులుగా మారాయి. ఏకాంగవీరుల ప్రసక్తి క్రీడాభిరామం, భీమేశ్వరపురాణం, పల్నాటి వీర చరిత్రలలో చూస్తాం.

గంగామాత ఆలయం, పక్కనే వీరగల్లులు

యుద్ధంలో ఓడి ఆత్మహత్యకి పాల్పడిన వీరులు చాలా మంది ఉన్నారు. వీరగల్లులపై గండకత్తెర వేసుకొని, కొండచరియ దూకి ప్రాణాలు విడిచిన వీరుల కథలు జపాన్ సమురాయ్ సంస్కృతిలోని సెప్పుక్కు, హరాకిరీ వంటి ఆచారాలు తలపిస్తాయి. అలాగే ‘పెండ్లాల తలచుక బిట్టేడ్చువారు’ అని యుద్ధంలో ఆయుధం పారవేసి గడ్డికరిచి మొత్తుకునే పిరికిపందల గురించి పల్నాటి వీర చరిత్రలో శ్రీనాథుడు చెప్పాడు. అంతే కాదు ఓడిన శత్రువుల తలలతో బంతులాటలు ఆడటం (శిరఃకందుక క్రీడావినోదం), వారి రక్తమాంసాలతో ఉడికించిన అన్నం కావలి దేవతలకి ఊరి చుట్టూ పొలిజల్లడం (రణంకుడుపు) వంటి రాక్షస సంస్కృతి వీరగల్లుల్లో సాహిత్యంలో కనిపిస్తుంది. ఇలా యుద్ధాలలోనూ, తిరుగుబాట్లలోనూ పాల్గొన్నవారి విగ్రహాలే కాక, ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడిన ఉదాత్తులకూ, సతీసహగమనం చేసిన స్త్రీ మూర్తులకు కూడా వీరశిలలను ఏర్పాటు చేసి వారి గౌరవాన్ని చాటుకునే వారు. చెరువు కట్టలు వర్షానికి తెగిపోయి గ్రామమంతా మునగకుండా వుండేందుకు తమ దేహాలనే కట్టలుగా అడ్డంకట్టి గ్రామస్థులను కాపాడిన వారికి పూజలందటం (వరంగల్ జిల్లా గణపురంలోని గణపసముద్రం చెరువు దగ్గర గౌండ్లదానిగండి), తరతరాలు వారి పేరును చెప్పుకోవడం ఇప్పటికీ మనం అనేక కథలలో వింటుంటాం. మరి ఈ గంగాదేవి గంగానదికి మారు పేరుగా పెట్టుకున్న దేవతపేరు కాకపోవచ్చనిపిస్తుంది. మరెవరైనా ఉదాత్తచరిత గల మహిళ చేసిన సాహసకృత్యమో, త్యాగపూరితమైన కథ వుండివుంటుంది. ఈ మూడు వీరగల్లులను పరిశీలిస్తే కేశాలంకరణగా పెద్దకొప్పు వుంది, ఎడమ చేతిలో డాలు, కుడిచేతిలో శూలం వంటి ఆయుధాన్ని ధరించారు. మొలలో చురకత్తి లేదా కత్తివంటిది వుంది. ఈ వీరగల్లులు ఏదో పోరాట చరిత్రను గుర్తుకు చేసుకుంటూ ఏర్పాటు చేసినవి అయివుంటాయి. వందల సంవత్సరాలు నిలిచే సాహసమో, త్యాగమో చేసిన ఆ స్త్రీమూర్తికి వందనం.