పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమాధానంగా మరో ధర్మసూక్ష్మంలా వాస్తు, శాస్త్ర కోణాన్ని కూడా చూడవచ్చు. శివకేశవాలయాలు ఒకే ప్రాంగణంలో వుంచాల్సి వచ్చినపుడు వాటి శక్తిపాతం సన్నగిల్లకుండా వుండేందుకు అనువుగా వాటి దిశానిర్ణయం చేస్తారు. ఇక్కడ ఆలయాల సమిష్టి ప్రాంగణంలో శివాలయం ప్రాథమికంగా వుంది కాబట్టి, ఆ ఆలయానికి మధ్యలో ముక్కంటేశ్వరాలయం దానికి వెనుకగా అన్నట్లు వేణుగోపాలుడు వున్నాడు. భౌగోళిక వాస్తురీత్యా దక్షిణ దిశను చూస్తున్నట్లు వుంటాడు కానీ, ఆలయ సముదాయపు దృష్టితో చూస్తే త్రికూటాలయదిశకు వ్యతిరేకంగా అవతలి దిశను చూస్తున్నట్లుంటాడు. మరోలా చెప్పాలంటే త్రికూటాలయం వెనుక భాగం వేణుగోపాలుడి సంరక్షణలో వుంటే, వేణుగోపాలుడి వెన్నుకాస్తున్నట్లు త్రికూటాలయం వుంటుంది. ఇక్కడ మరో చమత్కారం ఏమిటంటే వేణుగోపాలుడు చూస్తున్న దిశగా భక్తుల ప్రవేశంకాక సాధారణ ఆలయాలలో మాదిరి గానే తూర్పుదిశనుంచి ఆలయంలోకి ప్రవేశించే పద్దతిలో మంటప నిర్మాణం చేపట్టారు.

ఈ సంక్లిష్ట నిర్మాణం సౌందర్యం ఈ ఆలయ ప్రత్యేకత. దీనిని ఆలయనిర్మాణ పద్దతులను అధ్యయనం చేసిన వారు పరిశీలిస్తే దీనిగురించి మరెన్నో కొత్త సంగతులు బయటకు వచ్చే అవకాశం వుంది. ఈ వేణుగోపాలుడి ఆలయం ఇప్పటికీ రక్షిత కట్టడాల జాబితాలోకి రాలేదు. ఇప్పటికే ఒక మూలగా వున్న స్తంభం దాదాపు విరిగి పడిపోయే దశలో వుంది. దానిని కాపాడేందుకు తగిన ఆధారాన్నివ్వడమో లేదా మరో స్తంభం వాడి పునర్నర్మించడమో చేయకపోతే మొత్తం ఆలయమే శిథిలం అవుతుంది. ఆ ఒక్క స్తంభం కూలితే మొత్తం కాకతీయ నిర్మాణ శైలిని ప్రతిబించించే మండపమే చేజారిపోతుంది. అందుకే ప్రభుత్వమే కాకున్నా స్థానికులైనా ఈ విషయంలో కొంత శ్రద్ధను చూపించ గలిగితే ఆలయాన్ని రక్షించుకోగలం. అదే విధంగా ఈ ఆలయసముదాయానికి కూడా ప్రధానాలయానికి అనుబంధంగా సందర్శన మార్గాన్ని ఏర్పరచాలి. రక్షణగోడను కూడా నిర్మించాల్సివుంది.

నలుదిక్కులా విస్తరించిన ఆలయశోభ

కూసుమంచిలో గణపేశ్వరాలయం నిర్మించే సమయంలోనే గణపతి మహారాజు ఆనాటి పండితుల సూచనల మేరకు ఆలయం చుట్టూ మరిన్ని దేవాలయాలను నిర్మించారని చెబుతారు. గణపేశ్వరాలయానికి సుమారు 5 కి.మీ. దూరంలో నాలుగు దిక్కులా వివిధ ఆలయాలు ఉన్నాయి. దక్షిణదిశగా వేణుగోపాలస్వామి ఆలయం ఉంటే, ఈశాన్యం మూలన జీళ్ళ చెరువు గ్రామంలో శివాలయం ఉంది. ఆగ్నేయంలో పెరిక సింగారం గ్రామంలో, వాయవ్యం వైపున పాలేరు గ్రామంలో వేణుగోపాలస్వామి ఆలయాలు ఉన్నాయి. అయితే, నైరుతిలోని వేణుగోపాల స్వామి ఆలయం మాత్రం వెలుగులోకి రాలేదు. జీళ్లచెరువు