పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వుండటం ఒక విశేషం. ఒకే ఆలయ ప్రాంగణంలో హరిహరులిద్దరూ ప్రాధాన్యత కలిగివుండటం కాకతీయుల మతసామరస్యానికి ప్రతీక. ఈ పద్దతిలో హరిహరాద్వైతాన్ని చాటిచెప్పేనిర్మాణాల ఉదాహారణలు చాలా వున్నాయి. వరంగల్ లోని కాశీబుగ్గలో శ్రీరంగనాథ ఆలయంలో ఈశ్వరుని పానవట్టము మీద శ్రీరంగనాథ స్వామి విగ్రహము చెక్కబడివుంది. ఓరుగల్లు సమీపంలోని శాయంపేట హవేలీలోని పాంచాలరాయ స్వామి దేవాలయంలో కూడా పానవట్టం మీదనే పాంచాలరాయ స్వామి విగ్రహం చెక్కబడింది. వరంగల్ కోటలో ఒక పాడుబడిన దేవాలయంలో పానవట్టం మీదనే శ్రీదేవీ భూదేవీ సహిత విష్ణుమూర్తి విగ్రహం ప్రతిష్టింపబడింది. వేయిస్తంభాల గుడి త్రికూటాలయంలో శివ-వాసుదేవ-సూర్యాలయాలను నిర్మించారు. అక్కడే నృత్యనృసింహుని విగ్రహాన్ని చెక్కించారు. పాలంపేట దేవాలయంలో సైతం శ్రీకృష్ణుని విగ్రహంతో పాటు రంగమంటపం పైభాగంలో చెక్కిన క్షీరసాగర మధనం వంటి అనేక విష్ణులీలలు కనిపిస్తాయి. ఇవన్నీ కాకతీయులు శైవ-వైష్ణవ మతాలను సమన్వయ పరచుతూ ప్రజలలో సామరస్యాన్ని పెంచేందుకు తీసుకున్న చర్యలుగా అర్ధం చేసుకోవచ్చు. ఇదే పద్దతిని పోతన,శ్రీనాథాదులు పాటిస్తూ తమ రచనలలో ‘హరిహరనాథ సృష్టి’ చేసారు. కాకతీయ ప్రోలరాజు సామంతుడైన వేమబోల మల్లినాయకుడు మాటేడులో అలాంటి త్రికూటాలయాన్ని నిర్మించాడు. కాకతి రుద్రదేవుడు అనమకొండ(హన్మకొండ) లో వేయిస్తంభాల గుడిని అదే పద్దతిలో కట్టించాడు. పిల్లలమఱ్ఱి రామిరెడ్డి తన పేరుతోనూ తన తల్లిదండ్రుల పేరుతోనూ త్రికూటాలయాలను నిర్మించాడు. ఐనవోలు, కుందారం, కారపాములు, కొండపాక, నాగులపాడు, పానగల్లు మొదలైన చోట కూడా ఇలాంటి త్రికూటాలయాలు కనిపిస్తాయి.

వేణుగోపాలస్వామి ఆలయం దక్షిణ దిశకు ఎందుకు తిరిగి వుంది?

సాధారణంగా దేవాలయాలు తూర్పుదిశగానే తిరిగి వుంటాయి. యముడు దక్షిణ దిక్కుకు అధిపతి. యమలోకాధిపతి కూడా! ప్రతిప్రాణి యొక్క పాప పుణ్యాలను తరచి చూసి శిక్షలు అమలు జరిపే ధర్మ దేవత! ఈ లక్షణమే, ఈ ధర్మమే, ఈయనకు మిగతా దేవతల కంటే ఉగ్రమైన రూపాన్ని ఇచ్చింది. అందుకేనేమో యమదిశగా చూస్తున్నట్లు సాధారణంగా దేవాలయాల నిర్మాణం చేయరు. కానీ ఈ ఆలయ సముదాయాలలోని వేణుగోపాల స్వామి ఆలయం మాత్రం దక్షిణ దిశగా తిరిగి వుంది. గర్భాలయంలోని మూల విరాట్టు దక్షిణ దిశలోకి దృష్టిని సారించేలా వున్న నిర్మాణాలు మేథో దక్షిణామూర్తి ఆలయాల్లోనూ, కొన్ని మృత్యుంజయ నరసింహాలయాల్లోనూ, చిరంజీవి అయిన ఆంజనేయస్వామి ఆలయాల్లో తప్ప అరుదుగా చూస్తాం. అటువంటి అరుదైన ఆలయమే గణపేశ్వరాలయానికి ఉపాలయంగా వున్న ఈ వేణుగోపాల స్వామి ఆలయం కూడా. మరి ఈ వేణుగోపాలుడు దక్షిణ దిశను చూడటంలో ప్రత్యేకత ఏమిటి? అనేదానికి